SP Anuradha : కోచింగ్ సెంటర్ల గుర్తింపు 46 మంది అరెస్ట్
అరెస్ట్ అయిన వారంతా తెలంగాణ వారే
SP Anuradha : అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు రైల్వే ఎస్పీ అనురాధ(SP Anuradha). ఆదివారం అనురాధ మీడియాతో మాట్లాడారు.
మొత్తం జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. వీరంతా ఆర్మీ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన వారని తెలిపారు. అయితే
టెస్ట్ లు పూర్తయి పరీక్ష రాయాల్సి ఉందన్నారు.
మూడు నాలుగసార్లు వాయిదా పడడం, అంతలోనే కేంద్రం అగ్నిపథ్ స్కీం ప్రకటించడంతో ఇక జాబ్స్ రావేమోనన్న ఆందోళనలో ఉన్నారని
చెప్పారు. వీరికి శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్ల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామన్నారు.
ఇదే సమయంలో ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే దానిపై కూడా వివరణ ఇచ్చారు ఎస్పీ అనురాధ. రైల్వే స్టేషన్ లో పక్కా ప్లాన్ తో వచ్చారు.
అప్పటికే రైల్వే స్టేషన్ లో రైళ్లు నిలిచి ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాలని అనుకునే ప్రయాణికులు నిలిచి ఉన్నారు. ఒక్కసారిగా రావడం, ఆందోళనకు దిగడం, రాళ్లు రువ్వడంతో భయాందోళనకు లోనయ్యారని తెలిపారు.
ఇదే సమయంలో ఆయిల్ తో కూడిన రైల్వే ట్యాంకర్లు ఉన్నాయి. ఈ సమయంలో వాటిపై దాడికి పాల్పడితే పెద్ద ఎత్తున విధ్వంసం జరిగి ఉండేదన్నారు.
దీంతో ముందు జాగ్రత్తగా రైల్వేకు చెందిన పోలీసులు హెచ్చరికలు జారీ చేశారని కానీ వినిపించు కోలేదన్నారు. మొదట 2 వేల మంది మూకుమ్మడిగా వచ్చారని, ఆ తర్వాత సంఖ్య పెరిగిందన్నారు.
అయితే కాల్పులు జరిపింది రైల్వే పోలీసులేనని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలపాలని, ఆస్తులు ధ్వంసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
అంతే కాకుండా అభ్యర్థులను రెచ్చ గొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని చెప్పారు ఎస్పీ అనురాధ(SP Anuradha). అంతకు ముందు
వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పక్కా సమాచారంతో దీనికి స్కెచ్ వేశారని తెలిపారు.
అరెస్ట్ అయిన వారంతా తెలంగాణకు చెందిన వారేనని చెప్పారు. రైల్వే యాక్ట్ 150 కింద నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం
ఉందన్నారు అనురాధ.
Also Read : ఎలా గెలవాలో చెస్ నేర్పుతుంది – మోదీ