HD Kumaraswamy : ఆర్ఎస్ఎస్ కోసమే అగ్నిపథ్ స్కీం
కుమార స్వామి సంచలన కామెంట్స్
HD Kumaraswamy : కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD Kumaraswamy) షాకింగ్ కామెంట్స్ చేశారు. అగ్నిపథ్ స్కీం పూర్తిగా దేశ ప్రయోజనాలకు విరుద్దమని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ముందస్తు ప్లాన్ లేకుండా తీసుకు వచ్చిన పథకంగా పేర్కొన్నారు.
ఇదే సమయంలో కుమార స్వామి భారతీయ జనతా పార్టీ అనుంగు సంస్థ ఆర్ఎస్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్ఎస్ఎస్ శ్రేణులను ఆర్మీలోకి చొప్పించేందుకు చేసిన ప్రయత్నం అని మండిపడ్డారు.
అంతే కాదు దీనిని అడ్డం పెట్టుకుని దేశ రక్షణ రంగంపై పట్టు సాధించేందుకే అగ్నిపథ్ ను తీసుకు వచ్చారంటూ ఫైర్ అయ్యారు కుమార స్వామి.
మరో వైపు ప్రవక్తపై చేసిన వ్యాఖ్యుల కలకలం రేపుతుండడంతో దాని తీవ్రతను తగ్గించేందుకు మోదీ వేసిన ఎత్తుగడగా దీనిని అభివర్ణించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అమ్మడమో లేదా లీజుకు ఇవ్వడమో చేస్తూ వచ్చారు.
ఇక మిగిలింది దేశానికి భద్రత కల్పిస్తున్న రక్షణ రంగంపై కన్నేశారని దానిని కూడా ప్రైవేట్ పరం చేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేనా మీరు ప్రవచిస్తున్న సమున్నత భారతం అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు మాజీ సీఎం కుమార స్వామి(HD Kumaraswamy).
అగ్ని వీరులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అవుతారని, సర్వీసు ముగిసినా వారు అలాగే ఉంటారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పునరాలోచించాలని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం.
10 లక్షల మంది అగ్నివీరుల్లో 2.5 లక్షల మంది ఆర్మీలో ఉంటారని, మిగతా 75 శాతం మంది రూ. 11 లక్షలతో బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా కొనసాగుతారని ఆరోపించారు.
Also Read : ‘అగ్నివీర్స్’ రిక్రూట్మెంట్ షెడ్యూల్ డిక్లేర్