TMC Protest : శివసేన ఎమ్మెల్యేలకు నిరసన సెగ
గౌహతి హొటల్ ముందు టీఎంసీ ఆందోళన
TMC Protest : మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడి పోయేందుకు కారణమైన రెబల్ శివసేన ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని రెబల్ ఎమెల్యేలు మొన్న గుజరాత్ లోని సూరత్ హోటల్ లో ఉన్నారు.
అక్కడి నుంచి క్యాంపును అస్సాంలోని గౌహతి లోని హోటల్ కు మార్చారు. దీంతో శివసేన పార్టీకి మొదటి నుంచి మద్దతుగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హోటల్ వద్ద పెద్ద ఆందోళన చేపట్టింది.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కావాలని ఇలా చేస్తోందంటూ ఆరోపించింది. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా శివసేన పార్టీ టీఎంసీకి మద్దతు ప్రకటించింది.
ఈ మేరకు పార్టీ తరపున శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దీదీ తరపున ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు సీఎం.
తాజాగా మరాఠా ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీనే కుట్ర పన్నిందంటూ ఆరోపించారు మమతా బెనర్జీ. క్యాంపు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది బీజేపీ సర్కార్ అంటూ మండిపడ్డారు.
గురువారం రెబల్ శివసేన ఎమ్మెల్యే విడిచి చేసిన హొటల్ వెలుపల టీఎంసీ(TMC Protest) ఆందోళన చేపట్టింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
శివసేన తిరుగుబాటుకు అసోంలోని అధికార బీజేపీ తన వనరులన్నింటినీ పెట్టుబడిగా పెట్టిందంటూ ఆరోపించారు టీఎంసీ నేతలు. ఈ ఆందోళన కార్యక్రమం టీఎంసీ అస్సాం చీఫ్ రిపున్ బోరా నాయకత్వం వహించారు.
Also Read : ఉద్దవ్ ఠాక్రేపై పోలీసులకు ఫిర్యాదు