Mohammed Zubair : ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ జుబైర్ అరెస్ట్
కేంద్ర సర్కార్ తీరుపై విపక్షాలు ఫైర్
Mohammed Zubair : మత పరమైన మనోభావాలను దెబ్బ తీశారని, అంతే కాకుండా శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్(Mohammed Zubair) ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఈ అరెస్ట్ పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఒక రోజు పోలీస్ కస్టడీకి తరలించారు. ఈనెలలో ఒకరు ఫిర్యాదు చేశారని ఆ మేరకు జుబైర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒక నిర్దిష్టమైన మతానికి చెందిన దేవుడిని ఉద్దేశ పూర్వకంగా అవమానించేలా ప్రశ్నార్థకమైన చిత్రాన్ని ట్వీట్ చేశాడని ఆరోపించారు. మహ్మద్ జుబైర్ మార్చి 2018లో ట్వీట్ షేర్ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రతీక్ సిన్హా మాట్లాడారు. జుబైర్ ను 2020 నుండి వేరే కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీకి పిలిపించారని తెలిపారు.
ఆ కేసులో అరెస్ట్ చేయకుండా కోర్టు అతనికి రక్షణ కల్పించిందన్నారు. తప్పనిసరి నోటీసు లేకుండానే ఈ కొత్త కేసులో అతడిని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.
పదే పదే అభ్యర్థించినా పోలీసులు తమకు ఎఫ్ఐఆర్ కాపీ తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జుబైర్ ను పాత కేసులో విచారిస్తున్నామని, తగినంత సాక్ష్యాలను నమోదు చేశాక కొత్త కేసులో అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు.
అతడిని ఇంకా విచారిస్తున్నామని తదుపరి కస్టడీ కోసం బుధవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారని సమాచారం. ఇదిలా ఉండగా జుబేర్ అరెస్ట్ పై కలకలం రేగింది. విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
Also Read : శాన్ ఆంటోనియోలో 46 మంది మృతి