Venkat Reddy: మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి !

మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి !

Venkat Reddy: గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి(Venkat Reddy) అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఆయన్ను సస్పెండ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Venkat Reddy..

ఏ ప్రభుత్వ ఉద్యోగిపైనైనా విచారణ జరపాలంటే సంబంధిత దర్యాప్తు సంస్థ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి పొందారు. ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీజీ వెంకటరెడ్డి(Venkat Reddy) ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నందున పదవీ విరమణ చేయడం సాధ్యం కాదు. గనుల లీజుల కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో వెంకటరెడ్డి పలు నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తోంది.

ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రభుత్వానికి రూ. 800 కోట్లు బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఎన్‌వోసీ ఎలా జారీ చేశారు ? ఎవరి ఆదేశాల మేరకు చేశారనే వివరాలను ఏసీబీ సేకరిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ ఫ్రా సంస్థల ఉల్లంఘనల్లో వెంకటరెడ్డి(Venkat Reddy) ప్రమేయంతో పాటు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీల్లో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్ల సమర్పణ తదితర అంశాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది. వెంకటరెడ్డి గత రెండు నెలలుగా పరారీలోనే ఉన్నారు. సస్పెన్షన్‌ నోటీసులు అందజేయడానికి గనుల అధికారులు వెళ్లినా సరే ఆయన నివసించే చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై కూడా ఏసీబీ గురిపెట్టింది.

Also Read : CM Revanth Reddy: భగవద్గీత స్ఫూర్తితోనే ఆక్రమణల కూల్చివేతలు – సీఎం రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!