ACB Notices: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ACB Notices : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ- కేసులో ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ‘ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, ఏసీబీ ఖచ్చితంగా సహకరిస్తాను. యూకే, యూఎస్ వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. కార్యక్రమాల కోసం బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి, నేను తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతాను’ అని అన్నారు.

‘‘రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్నారు. 48 గంటల క్రితం ఈడీ ఛార్జ్‌షీట్‌లో రేవంత్‌ పేరు వచ్చింది. అందుకే ఆయన కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తాను’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. నోటీసులపై ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారమిచ్చినట్లు ఆయన తెలిపారు.

కాగా, ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ గతంలో ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఆయన్ను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఈ కార్‌ రేసు నిర్వాహణకు సంబంధించి రూ.55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదనే అంశంపై కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. అలాగే కేబినెట్, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ACB Notices – కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది’’ అంటూ ఎక్స్‌ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్‌ సైనికులదని కవిత అన్నారు.

ఏసీబీ నోటీసులపై హరీష్‌రావు రియాక్షన్‌

కేటీఆర్‌ కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ… ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమన్నారు. ‘‘కల్పిత కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గెలుచుకోవు. కేటీఆర్‌కు అండగా నిలబడతాం. కేటీఆర్ ఏసీబీ కేసులో సత్యం గెలుస్తుంది’’ అని హరీష్‌రావు అన్నారు.

Also Read : KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!