Priyanka Gandhi : అమరుల త్యాగం ఫలించలేదు
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ దిక్కు లేనిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు శ్రీకాంత్ ఆచారి తో పాటు ఎందరో తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని కానీ అమరుల త్యాగాలు ఫలించ లేదని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించిన వాళ్లు ఇవాళ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈ దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఇవాళ ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని ఆరోపించారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, యువత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో బురిడీ కొట్టించడం తప్ప ఒనగూరింది ఏమీ లేదన్నారు. కానీ ఆనాడు తెలంగాణ ప్రజల బాధను తన తల్లి సోనియా గాంధీ అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని చెప్పారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).
సోమవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా పాలన సాగుతుందన్నారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలు అంతులేని కష్టాలతో ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. నీళ్లు రావడం లేదని మద్యం ఏరులై పారుతోందన్నారు. పాలకులు కుబేరులయ్యారని నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చారని మండిపడ్డారు.
Also Read : జూనియర్ కార్యదర్శులకు డెడ్ లైన్