Air India : ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో దిల్లీ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. హాంకాంగ్ నుంచి దిల్లీ విమానాశ్రయానికి వచ్చిన AI 315 విమానం ల్యాండింగ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదంతో అప్రమత్తమైన దిల్లీ ఎయిర్ పోర్టు సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎయిరిండియా (Air India) స్పందించింది.
Air India Flight Catches Fire
‘‘హాంకాంగ్ నుంచి దిల్లీకి వచ్చిన AI315 విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆగ్జలరీ పవర్ యూనిట్ (APU)లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు విమానం దిగడం ప్రారంభించిన వెంటనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతింది. ప్రయాణికులు, సిబ్బంది సాధారణంగానే దిగి సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కోసం విమానాన్ని నిలిపివేశాం’’ అని ఎయిరిండియా (Air India) ‘ఎక్స్’లో పేర్కొంది.
ఏపీయూ అనేది విమానాల్లో తోక భాగంలో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌లా పనిచేస్తుంది. విమానంలో లైట్లు, కంప్యూటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మొదలైనవి ఈ ఏపీయూ వ్యవస్థ ద్వారా పని చేస్తాయి. విమానం ఇంజిన్ ప్రారంభం కావాలంటే తగినంత గాలి కావాలి. ఆ గాలిని ఈ ఏపీయూ అందిస్తోంది. అంతేకాదు కేబిన్ లో ప్రయాణికులకు చల్లటి గాలిని అందించడంలో సహాయపడుతుంది. విమానానికి ఉన్న మెయిన్ ఇంజిన్ విఫలమైతే ఏపీయూ ద్వారా గాలి,కరెంట్ ఉత్పత్తి అవుతుంది.
కాగా, ఈ ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్ నిర్వహణ, విమానాల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 260 మంది మరణించిన తర్వాత ఎయిర్ ఇండియాపై తీవ్ర నిఘా కొనసాగుతుండగా ఈ ఘటన జరిగింది. నిన్న ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో సర్వీసు రద్దు చేశారు. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. 160 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్‌బస్ A321 విమానం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. రాత్రి 7:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం. టేకాఫ్ నిలిపివేసిన తర్వాత అందరు ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దింపేశారు.
Also Read : Shashi Tharoor: కాంగ్రెస్ నేత మురళీధరన్ పై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
