బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు ఇస్తామని సంచలన ప్రకటన చేసిన టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బాసటగా నిలిచారు సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా ఎస్పీ, టీఎంసీ పార్టీలు కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పాయి. తాజాగా జనతాదళ్ యూ పార్టీ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రతిపక్షాలను కలిపే ప్రయత్నంలో పడ్డారు.
ఈ మేరకు ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఆ తర్వాత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ ఏకపక్షంగా ఉన్నామంటూ ప్రజలకు సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ తనను కలిసిన నితీశ్ కుమార్ తో. ఇదిలా ఉండగా మమతా బెనర్జీ బాటలో నడుస్తున్న అఖిలేష్ యాదవ్ తన స్వరాన్ని మార్చారు. దీదీ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఒకవేళ వచ్చే 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేసే అవకాశం లేక పోలేదన్నారు.
బీహార్ లో కాంగ్రెస్ , జేడీయు, ఆర్జేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీయూ 17 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో కొనసాగిస్తూ వచ్చిన బంధాన్ని తెంచుకున్నారు నితీశ్ కుమార్. మొత్తంగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఎన్నికల ఫలితాలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి.
