MK Stalin : 12న సుప్రీం తీర్పుపై అఖిల‌పక్ష స‌మావేశం – స్టాలిన్

శాస‌న‌స‌భాప‌క్ష నేత‌లంద‌రికీ లేఖ‌లు పంపిన సీఎం

MK Stalin : అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు సైతం 10 శాతం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డం స‌బ‌బే అంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్ప‌డంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ఎండీఎంకే జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వైకో నిప్పులు చెరిగారు. ఈ తీర్పు అసమంజ‌స‌మ‌ని, ఆమోద యోగ్యం కాద‌న్నారు.

ఈ తీర్పును స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు. ఈ త‌రుణంలో త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) మంగ‌ళ‌వారం అఖిల‌ప‌క్షం స‌మావేశం కావాల‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చ‌ర్చించేందుకు అన్ని పార్టీలకు చెందిన శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ల‌కు లేఖ‌లు రాశారు సీఎం.

స‌చివాల‌యంలో జ‌రిగే సంప్ర‌దింపుల స‌మావేశంలో పాల్గొనాల్సిందిగా ఈ లేఖ‌లో ఎంకే స్టాలిన్ కోరారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి శాస‌న‌స‌భా ప‌క్షం నుంచి ఇద్ద‌రు ప్ర‌తినిధులు రావాల్సిందిగా సూచించారు ఇప్ప‌టికే. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు (ఈడ‌బ్ల్యుఎస్) 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పిస్తూ న‌వంబ‌ర్ 7న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఈ తీర్పుపై త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించేందుకు న‌వంబ‌ర్ 12న అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ రిజర్వేష‌న్ల విధానం సామాజిక న్యాయం, స‌మాన‌త్వానికి పూర్తిగా విరుద్ద‌మ‌న్నారు సీఎం. 12న ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌మావేశం ఉంటుంద‌న్నారు.

అసెంబ్లీలో అన్ని పార్టీల నేత‌ల‌తో ఇప్ప‌టికే చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు ఎంకే స్టాలిన్. ఇదే స‌మ‌యంలో పూర్తిగా ఆర్థికంగా వెనుక‌డిన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం అనేది మిగ‌తా సామాజిక వ‌ర్గాల‌ను వెన‌క్కి నెట్టివేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. అందుకే తాము అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read : ఈశాన్య భార‌తంలో ప్ర‌తి ఊరికి 4జీ సేవ‌లు

Leave A Reply

Your Email Id will not be published!