CM KCR : నీతి ఆయోగ్ ను బహిష్కరిస్తున్నా – కేసీఆర్
సంచలన ప్రకటన చేసిన తెలంగాణ సీఎం
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 8న జరగనున్న నీతి ఆయోగ్ మీటింగ్ లో తాను పాల్గొనడం లేదని , బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ నిర్ణయం చాలా బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు పీఎంకు లేఖ రాశానని తెలిపారు సీఎం(CM KCR). నీతి ఆయోగ్ అనేది నిరర్దక సంస్థగా మారిందంటూ ధ్వజమెత్తారు. మేధో మధనం లేకుండా జరుగుతోందన్నారు. ఇది పూర్తిగా భజన మండలిగా మారి పోయిందని ఆరోపించారు.
గతంలో ప్లానింగ్ కమిషన్ బాగుండేదని కానీ మోదీ తీసుకు వచ్చిన నీతి ఆయోగ్ పూర్తిగా నిరుపయోగంగా మారిందని మండిపడ్డారు కేసీఆర్. మోదీ వాగ్ధానాలు, బీజేపీ హామీలు పెద్ద జోక్స్ గా మారాయంటూ ఎద్దేవా చేశారు.
దేశంలో పరిస్థితులు దారుణంగా తయారైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేశారని దాని స్థానంలో తీసుకు వచ్చిన నీతి ఆయోగ్ వల్ల లాభం లేకుండా పోయిందన్నారు కేసీఆర్.
నాటి నెహ్రూ హయాంలో ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు , ఎల్ఐసీ, ఇండియన్ రైల్వేస్ అన్నీ ఏర్పాటైతే ఇప్పుడు నిరుపయోగంగా మారాయని ఆరోపించారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగి పోతోందని కానీ మోదీకి సోయి లేకుండా పోయిందన్నారు.
Also Read : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన