Anganwadis Strike: అంగన్‌వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం ! సమ్మె విరమణ !
అంగన్‌వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం ! సమ్మె విరమణ !
Anganwadis Strike: ఆంధ్రప్రదేశ్ లో గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. సోమవారం రాత్రి మంత్రి బొత్స సత్యానారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అంగన్వాడీలు పెట్టిన మొత్తం 11 ప్రధాన డిమాండ్లకు గాను… ప్రభుత్వం 10 డిమాండ్లను ఆమోదించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల యూనియన్ నాయకులు తెలిపారు. మంగళవారం నుండి వారు సాధారణంగా విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీల సమ్మెలో ప్రధాన డిమాండ్ గా ఉన్న వేతనాలలు పెంపు మినహా మిగిలిన 10 డిమాండ్లకు ప్రభుత్వం ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ 11వ డిమాండ్ కూడా మరల ఈ ఏడాది జూలైలో పెంచుతామని… అంతేకాకుండా సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని చెప్పడంతో అంగన్వాడీలు సమ్మెను విరమించినట్లు తెలుస్తోంది.
Anganwadis Strike – ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ ఇవే
1. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపు చేస్తోంది. ప్రమాద బీమాగా రూ.2 లక్షలు.
2. అద్దెభవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు రూ. 66.54 కోట్ల రూపాయల నిధులను మంజూరు.
3. అంగన్వాడి కేంద్రాల్లో పరిశుభ్రతకోసం అవసరమైన చీపురులు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 55,607 సెంటర్లకి రూ.7.81 కోట్ల రూపాయల నిధులు మంజూరు.
4. సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్ లు, చిన్నపాటి మరమ్మత్తుల క్రింద 21206 అంగన్వాడి సెంటర్స్ కు ఒకొక్క కేంద్రానికి రూ. 3000/- రూపాయల చొప్పున రూ.6.36 కోట్ల రూపాయల నిధులు విడుదల.
5. అంగన్వాడీ సహాయకులను అంగన్‌వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరములకు పెంచుతూ G.O.MS:44 తేది 20.12.2023 జారీ.
6. ఆంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, అంగన్‌వాడీ హెల్పర్లకు రెండు నెలలకు ఒకసారి TA/DA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో నెంబర్.2303564/2023/PROG-I-A1,dt.20.12.2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడిన తేది నుండి ఇది అమల్లోకి.
7. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ ల కొనసాగింపుకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయం.
8. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లుకు రూ.1 లక్ష మరియు హెల్పర్‌లకు రూ. 40000 వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని G.O.MS.No:47 తేది 20.12.2023 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
9. నిబంధనలకు అనుగుణంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం.
10. సమ్మెకాలంలో వేతనాలు చెల్లింపు.
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ(Anganwadis) వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.05 లక్షల మంది సమ్మెకు దిగారు. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచినప్పటికీ… డిమాండ్లు పరిష్కరించకపోవడంతో అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు. మరోవైపు అంగన్వాడీలు తమ ఉద్యమాన్ని ఉదృతం చేయడం… ఈ ఉద్యమంలో రాష్ట్రంలో ఇద్దరు అంగన్వాడీక కార్యకర్తలు మృత్యువాత పడటంతో ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు సాగింది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అరెస్టులతో ప్రభుత్వం నిలువరించే ప్రయత్నం చేసింది.
అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంతో పాటు దాదాపు 70వేల మంది అంగన్వాడీ మహిళలపై వేటు వేస్తున్నట్లు… వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు జిల్లాల వారీగా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసారు. దీనితో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలతో సోమవారం నాలుగో సారి ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం నుండి అంగన్వాడీల సమ్మెకు బ్రేక్ పడింది.
Also Read : Anganwadis Strike: అంగన్‌వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం ! సమ్మె విరమణ !