Anna Lezhneva: తిరుమల వెంకన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా
తిరుమల వెంకన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా
Anna Lezhneva : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా లెజినోవాకు(Anna Lezhneva) వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్నా లెజినోవా రష్యా దేశానికి చెందిన క్రైస్తవ మతస్తురాలు అయినప్పటికీ… తిరుమలలో మాత్రం అడగడుగా ఆమె ఆలయ సాంప్రదాయాలు పాటించారు. దర్శనం కోసం డిక్లరేషన్ సమర్పించడం నుండి నిత్యాన్నదానంలో పాల్గొని సాధారణ భక్తులతో కలిసి భోజనం చేయడం వరకు అన్నీ ఆలయ ఆచార, సాంప్రదాయాల ప్రకారం పాల్గొన్నారు. దీనితో పవన్ సతీమణి అన్నా లెజినోవాపై కూటమి కార్యకర్తలు, అభిమానులతో పాటు సాధారణ భక్తులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Anna Lezhneva Visit
సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదం విషయం తెలియగానే మార్క్ శంకర్ సురక్షితంగా కోలుకోవాలంటూ… ఆమె తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మ్రొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం తిరుమల చేరుకున్న ఆమెకు… అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేసి ఆమె భూవరాహస్వామిని దర్శించుకున్నారు. ఆపై పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకుని… శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు. రాత్రి తిరుమల్లోనే బస చేసిన అన్నా కొణిదెల… సోమవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా… తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట భారీ విరాళాన్ని అందజేశారు. సోమవారం అన్నదానంలో మధ్యాహ్నం భోజనానికి అయ్యే రూ.17 లక్షల రూపాయలను ఆమె విరాళంగా టీటీడీ అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఆపై భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తిరుమల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం గుండా రేణి గుంట విమానాశ్రయానికి బయలుదేరారు డిప్యూటీ సీఎం సతీమణి. రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు అన్నా లెజినోవా పయనమయ్యారు.
Also Read : Telangana Government: తెలంగాణలో మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ! జీవో విడుదల !