AP Cabinet Meeting: ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయిస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం

 

 

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు.

మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షిస్తుందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాల పాటు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై ముఖ్యమంత్రి చర్చించారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

 

కేబినెట్ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సమాచార శాఖమంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ… అనంతపురంలో ఎనర్జీ రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. డైకిన్ ఎయిర్ కండిషన్ సంస్థ… తన యూనిట్‌ను రూ. 2475 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా 5400 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి 500 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఐటీ సెక్టార్, ఇండ్రస్ట్రియల్ హబ్‌గా విశాఖపట్నం రూపాంతరం చెందుతోందన్నారు.

అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అమరావతిలో న్యాయ విశ్వ విద్యాలయానికి స్థలం కేటాయింపు జరిగిందని చెప్పారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరులో స్థాపించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని విశ్వ విద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇక శ్రీపొట్టి శ్రీరాములు యూనివర్సిటీనీ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రేషన్ కార్డులలో పేరు చేర్చడం కోసం దాదాపు మూడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుల్లో మార్పు చేర్పులలో ప్రస్తుతం కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని కూటమి ప్రభుత్వం సీజ్ చేసిందని మంత్రి పార్థసారథి వివరించారు.

 

కేబినెట్‌ నిర్ణయాలు ఇవే

 

 

సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా మారనున్న అనంతపురం.
వివిధ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం.. టూరిజం పాలసీకి అనుగుణంగానే వీరికి ప్రోత్సాహకాలు.
డైకిన్ ఏసీ తయారీ సంస్థకు శ్రీసిటీలో విస్తరణకు అనుమతి. ప్రాజెక్టు వయబిలిటి దృష్టిలో ఉంచుకొని తిరిగి 500 ఎకరాలు కేటాయింపు.
అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. 20 శాతం సీట్లు ఏపీ విద్యార్ధులకు కేటాయించేలా రిజర్వేషన్.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏలూరు వద్ద ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం.
2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకం కోసం చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 22ఏ నిషేధ జాబితాలోని ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుతో పాటు ఫీజు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం.
కడప జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ కి 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్.

సత్యసాయి జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు భూ కేటాయింపు చేసేందుకు ఆమోదం.
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 615 ఎకరాల భూమి పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా బదలాయించేందుకు అంగీకారం.
రాజకీయ కక్షతో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి కొన్ని మండలాలు అన్నమయ్య జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం.
అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ ప్రాజక్టు కోసం ఐబీఎం, టీసీఎస్‌లతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం.
రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌ తగ్గించేందుకు ఏపీ మోటారు వాహనాల చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం.

 

Leave A Reply

Your Email Id will not be published!