AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల ! టాప్ 10 ర్యాంకర్లు వీరే !
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల ! టాప్ 10 ర్యాంకర్లు వీరే !
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో అకడెమిక్ సెనేట్ హాలులో ఈ ఫలితాలను విడుదల చేశారు. మే 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను విశాఖలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్, ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఐసెట్ పరీక్ష 34,131మంది విద్యార్థులు రాయగా… 32,719మంది క్వాలిఫై అయ్యారు. ఈ పరీక్షలో 95.86శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఐసెట్ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
ఐసెట్ కు మొత్తంగా 37,572మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 94 పరీక్ష కేంద్రాల్లో మే 7న ఐసెట్ నిర్వహించగా… 34,131మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్‌లో 32,719మంది క్వాలిఫై కాగా… వీరిలో 15,176మంది అబ్బాయిలు, 17,543మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మనోజ్ మేకా (విశాఖ) అత్యధిక మార్కులతో ఒకటో ర్యాంకు సాధించగా… ఆ తర్వాత ర్యాంకుల్లో ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్‌ఆర్ కడప), ఎస్. కృష్ణసాయి (ఎన్‌టీఆర్ జిల్లా), వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్), రేవూరి మాధుర్య (గుంటూరు), షేక్ బషీరున్నీషా (అనకాపల్లి), వి. అజయ్ కుమార్ (తిరుపతి), భీశెట్టి హరి వెంకట ప్రసాద్ (తూర్పుగోదావరి), ఎస్. గణేశ్ రెడ్డి (విశాఖపట్నం), మహేంద్ర సాయి చామా (తిరుపతి) నిలిచారు.
AP ICET 2025 ఫలితాల కోసం అభ్యర్థులు ఇలా చేయాల్సిందే
1) AP ICET 2025 అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.inలోకి వెళ్లాలి.
2) హోమ్ పేజీలో ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APICET) ఫలితాలు ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
3) APICET రిజిస్ట్రేషన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. మీ లాగిన్ ఆధారాలను నమోదు చేసి.. నిర్థారించుకోవాలి.
4) AP ICET పరీక్ష ఫలితం ర్యాంక్ కార్డు రూపంలో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5) AP ICET ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడమే తరువాయి.