AP Police: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు

 

ఏపీలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వీరయ్య చౌదరి హత్య కేసులో 11 మంది నిందితులను గుర్తించామని… వారిలో తొమ్మింది మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ… వీరయ్య చౌదరి అత్యంత దారుణంగా హాతమార్చిన 9 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. మృతుడు వీరయ్య స్వగ్రామం అమ్మనబ్రోలుకి చెందిన ఆళ్ళ సాంబయ్య ఈ హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా తమ దర్యాప్తులో గుర్తించామన్నారు. ఈ నిందితుల్లో ముప్పా సురేష్, దేవేంద్రనాథ్ చౌదరిలు వీరయ్య స్వగ్రామానికి చెందిన వారని తెలిపారు. ఇసుక వ్యాపారి వినోద్ అనే వ్యక్తితో పాటు నెల్లూరుకి చెందిన నలుగురు కిరాయి ముఠాతో వీరయ్య హత్యకు పథక రచన చేసి అమలు చేశారన్నారు. రాజకీయ, వ్యాపారాల్లో విభేదాలు నేపథ్యంలో వీరయ్య చౌదరిని కిరాయి హంతకులతో హత్య చేయించారని పేర్కొన్నారు.

 

 

ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరిని ఒంగోలులోని తన కార్యాలయంలో దుండగులు విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. నలుగురు నిందితుల్లో ఇద్దరు కత్తులతో ఆయన్ను 53 సార్లు విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. ఆపై స్కూటీ, ద్విచక్ర వాహనంపై వారు పరారయ్యారు. అధికార పార్టీ నేత దారుణ హత్యకు గురి కావడంతో… జిల్లా పోలీసులు ఈ కేసు దర్యాప్తును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందులోభాగంగా 55 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. అలాగే మొత్తం 50 బృందాలతో పోలీసులు ఈ దర్యాప్తు చేపట్టారు.

 

ఆ క్రమంలో తొలుత అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడుకు చెందిన ఇద్దరు ప్రధాన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏప్రిల్ 25వ తేదీ చీమకుర్తిలో నిందితులు వదిలి వెళ్లిన రక్తపు మరకలున్న స్కూటీని, ఆ మరుసటి రోజు ఒంగోలులోని మంగమూరు రోడ్డులో మరో ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొత్తం 55 మంది అనుమానితులను విచారించి అనంతరం నిందితుల విషయంలో పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. వీటి ఆధారంగా వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.

 

 

Leave A Reply

Your Email Id will not be published!