Politics : హీటెక్కిన రాజకీయం..వేచి చూస్తున్న జనం
Politics : వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. విపక్షం అధికారపక్షం మధ్య నువ్వా నేనా అనేంత స్థాయికి చేరుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంతగా యువ నాయకుడైన జగన్ రెడ్డి నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. ఆయన ఎక్కడ కూడా తగ్గడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో ఎలాగైనా సరే పాగా వేయాలని పావులు కదుపుతోంది. అంతే కాదు ఇప్పటికే ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కమలానికి అధికారం కట్టబెట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది.
మరో వైపు తనకు ఎదురే లేకుండా చేసుకోవాలనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలో ఎన్నికలు జరగబోయే తమిళనాడులో సైతం పవర్ లోకి రావాలని అనుకుంటోంది. ఇదే క్రమంలో జగన్ సైతం బీజేపీతో దోస్తీ చేస్తూనే తనకు కావాల్సిన నిధులు తెచ్చుకునే పనిలో పడ్డారు. గతంలో ఇదే కమలంతో చెలిమి చేసి చివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆశించిన ఫలితాలను రాబట్ట లేక పోయింది. రెండెంకల స్కోరుకే పరిమితం కావడంతో ..బలమైన మెజారిటీతో జగన్ రెడ్డి ప్రజారంజక పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలను చేపట్టారు.
విద్యా పరంగా పలు సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ పరంగా అత్యధిక ఎమ్మెల్యేలు కలిగి ఉండడంతో తాను అనుకున్న పనులకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో పనులు పారదర్శకతో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిధులు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో కొంత ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ప్రతి ఊరికి ఒక వాలంటీర్ చొప్పున నియమించడం, సంక్షేమ పథకాలు త్వరిగతిన లబ్దిదారులకు అందించేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా ప్రతిపక్షం మాత్రం ఏపీ సీఎం ఒంటెద్దు పోకడ పోతున్నారని, కొందరికే అందుతున్నాయని, ప్రజలను సమానంగా చూడడం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మంత్రులు మాత్రం మాటకు మాట అన్న రీతిలో సమాధానం ఇస్తున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై హైకోర్టు ధర్మాసనం అభ్యంతరం చెప్పడం కొంత ఇబ్బంది పెట్టింది. అయినా సీఎం వెనక్కి తగ్గడం లేదు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చానో వాటిని దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నానని స్పష్టం చేస్తున్నారు. కరోనాను అరికట్టడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే అమరావతి రాజధాని విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది.
అక్కడ తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఇదే క్రమంలో ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాలున్నాయి. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..సిఎం జగన్మోహన్ రెడ్డిలతో పాటు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, తదితరుల మధ్య మాటాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరాయి. మరో వైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏపీలో హీట్ తెప్పించాయి.
పరోక్షంగా నానిని ఉద్ధేశించి వకీల్ సాబ్ వచ్చాడని సీఎంకు చెప్పు అన్న మాటలపై నాని తనదైన శైలిలో స్పందించారు. అటు నాని అభిమానులు..ఇటు పవన్ ఫ్యాన్స్ మధ్య దూరాన్ని పెంచింది. అనంతపురం జిల్లాలో టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి..ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది. పనిలో పనిగా బీజేపీ స్టేట్ చీఫ్ సోమూ వీర్రాజు కూడా అప్పుడప్పుడు మాటలు పేల్చుతున్నారు. పొలిటికల్ లీడర్ల పంచ్ డైలాగులతో జనం మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
No comment allowed please