AP Speaker : చట్ట సభలు ప్రజా సమస్యలకు, అంశాలకు వేదికలు కావాలి. వ్యక్తిగత ద్వేషాలకు అడ్డాగా మారకూడదు. రాను రాను అధికార, విపక్ష సభ్యులకు మధ్య అంతరం పెరిగి పోతోంది.
తాజాగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ (AP Speaker)పట్ల టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏమైనా సమస్యలు ఉంటే విన్నవించాలి. దానికి అసెంబ్లీ వేదికగా మార్చుకోవాలి.
అంతే తప్పితే ప్రతి దానిని విమర్శిస్తూ, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడానికి యత్నించడం ప్రజాస్వామ్యంలో హర్షణీయం కాదు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం అసాధరణ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కీలక రూల్ విధించారు. అదేమిటంటే స్పీకర్ పోడియం సభ్యుల సీట్ల మధ్య తెలుపు, ఆకుపచ్చ, ఎర్ర గీతలను ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఎవరైనా లేదా ఏ సభ్యుడైనా రెడ్ లైన్ దాటితే ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతారు.
ఈ నిర్ణయం దేశంలో ఎక్కడా లేదు. మొదటిసారిగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఏపీ అసెంబ్లీ(AP Speaker). ఇందుకు సంబంధించి రూలింగ్ ఇచ్చారు సభాపతి సీతారాం.
తన పట్ల టీడీపీ సభ్యులు అనుసరించిన తీరు తనను బాధ పెట్టిందన్నారు. ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగితాలు చించి తనపై వేశారని, సంయమనం పాటించాలని కోరినా పట్టించు కోలేదని అందుకే గీతలు ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి ఎవరైనా సభా హక్కులకు భంగం కలిగించినా వేటు పడుతుందని హెచ్చరించారు.
Also Read : ప్లీనరీ తర్వాతే కేబినెట్ విస్తరణ