Arvind Kejriwal : ఆరోగ్య మంత్రి అరెస్ట్ అక్రమం – సీఎం
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేసింది.
దీనిపై తీవ్రంగా స్పందించారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని బీజేపీయేతర వ్యక్తుల్ని, వ్యవస్థలను, ప్రభుత్వాలను, మంత్రులను టార్గెట్ చేస్తూ వస్తోందని ఆరోపించారు.
మంగళవారం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మీడియాతో మాట్లాడారు. కేసుల పేరుతో డ్యామేజ్ చేయాలని చూసినా ప్రజలకు ఎవరు ఏమిటనేది బాగా తెలుసన్నారు. ఇదిలా ఉండగా సత్యేంద్ర జైన్ ఆప్ హిమాచల్ రాష్ట్ర ఇన్ చార్జ్ గా ఉన్నారు.
ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే బీజేపీ సర్కార్ ఇలాంటి చౌకబారు చర్యలకు దిగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
కేసు నమోదు చేశామని అంటున్నారే తప్పా ఈరోజు వరకు సరైన ఆధారాలు చూపించ లేక పోయారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అవినీతి, అక్రమాలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
ఒక వేళ ఎవరైనా తమ పార్టీకి చెందిన వారు కానీ లేదా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే తామే ముందుగా గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇందుకు ఉదాహరణగా తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా చేసిన నిర్వాకంపై తమ పార్టీకి చెందిన సీఎం భగవంత్ మాన్ విచారణ జరిపించి,
ఆధారాలు దొరికాక కేబినెట్ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. అంతే కాదు 2015లో తాను కూడా తన కేబినెట్ లో మంత్రిని తొలగించానని గుర్తు చేశారు. ఆయన అరెస్ట్ అక్రమమని స్పష్టం చేశారు సీఎం.
Also Read : అనిల్ దేశ్ ముఖ్ బెయిల్ పై విచారించండి