Arvind Kejriwal LG Saxena : ఎల్జీ స‌క్సేనాపై భ‌గ్గుమ‌న్న కేజ్రీవాల్

మేయ‌ర్ ఎన్నిక వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హం

Arvind Kejriwal LG Saxena : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్, నామినేటెడ్ స‌భ్యుల వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివాన‌గా మారింది. ప్రొటెం స్పీక‌ర్ గా భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ ను లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా నియ‌మించారు. చివ‌ర‌కు ఇవాళ ఎన్నిక జ‌ర‌గాల్సి ఉండ‌గా ఆప్ , బీజేపీ అభ్య‌ర్థుల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం ర‌ణ‌రంగంగా మారింది.

దీంతో ప్రొటెం స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు . ఈ మేర‌కు ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ ఎప్పుడు నిర్వహించాల‌నేది నోటీసు ద్వారా అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) . ఎల్జీ స‌క్సేనా త‌న స్థాయికి దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, అసంబ‌ద్ద నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు.

శుక్ర‌వారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌కు ఏం అర్హ‌త ఉంద‌ని, ఏం అధికారం ఉంద‌ని ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు అర‌వింద్ కేజ్రీవాల్. పూర్తిగా ఏక‌ప‌క్షంగా, భారత రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

స‌క్సేనా ఎల్జీగా కాకుండా బీజేపీకి వత్తాసు ప‌లుకుతూ కార్య‌క‌ర్త‌గా మారారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆప్ చీఫ్‌. ప్ర‌జ‌లు ఇదంతా గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు.

ఎల్జీ త‌న ప‌ని తాను చేసుకోకుండా అన్నింట్లో వేలు పెడుతున్నారంటూ, ప‌దే ప‌దే పాల‌న‌కు అడ్డు త‌గ‌ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడంటూ ఆరోపించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : మేయ‌ర్ ఎన్నిక వాయిదా చ‌ట్ట విరుద్దం

Leave A Reply

Your Email Id will not be published!