Biren Singh: మణిపుర్‌ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌పై కాల్పులు !

మణిపుర్‌ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌పై కాల్పులు !

Biren Singh: మైతేయ్‌, కుకీ తెగల మధ్య పోరుతో గత ఏడాదంతా అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ లో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలో 37వ నెంబరు జాతీయ రహదారిపై ఆకస్మికంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఇదే విషయాన్ని సీఎం కార్యాలయానికి చెందిన వర్గాలు దృవీకరించాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Biren Singh Attack

జూన్ 6న జిరిబామ్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. 70కి పైగా ఇళ్లను తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొందరు పౌరులు వేరే చోటుకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ వద్ద నుంచి లైసెన్స్‌ తుపాకులను జప్తు చేయడంతో వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ స్థానికులు జిల్లా పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. ఇలా కొన్ని రోజులుగా అశాంతి నెలకొన్న ఈ ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం బీరేన్‌సింగ్‌(Biren Singh) అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇంఫాల్ నుంచి జిరిబామ్‌కు సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌ బయల్దేరింది. దీనిపై సాయుధులైన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ ద‌ళాల‌పై మిలిటెంట్లు ప‌లుమార్లు ఫైరింగ్ జ‌రిపారు. అయితే ఆ దాడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

అయితే దాడి సమయంలో సీఎం ఘటనా ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్‌ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.

Also Read : Chandrababu Sign : ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు సంతకాలు ఆ 3 ఫైల్స్ పైనే

Leave A Reply

Your Email Id will not be published!