Badar Khan Suri: అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు ! హమాస్‌తో సంబంధాలే కారణమా ?
అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు ! హమాస్‌తో సంబంధాలే కారణమా ?
Badar Khan Suri : అమెరికా పోలీసులు బదర్ ఖాన్ సూరి అనే భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులతో అతడికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ అరెస్టు చేసినట్లు సమాచారం. బదర్ ఖాన్ సూరి స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేస్తున్నారు. యూనివర్సిటీలో సూరి(Badar Khan Suri)… హమాస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ లోని అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఆరోపించారు. అంతేకాక.. ఉగ్రవాద సంస్థలోని పలువురితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీంతో అతడి వీసాను రద్దు చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే ఫెడరల్ ఏజెంట్లు సోమవారం వర్జీనియాలోని అతడి ఇంటి వెలుపల అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే, తన అరెస్టుపై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Badar Khan Suri Arrest
ఈ ఘటనపై జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్పందించింది. ‘బదర్ ఖాన్ సూరి డాక్టోరల్ పరిశోధకుడిగా ఉన్నారు. సూరి ఎలాంటి చట్టవిరుద్ధమైన చర్యల్లో పాల్గొంటున్నారనేది, ఈ అరెస్టుకు కారణం ఏంటనేది మాకు తెలియలేదు. ఈ కేసుకు సంబంధించి బహిరంగ విచారణకు మేం పూర్తిగా మద్దతిస్తున్నాం. కోర్టు న్యాయబద్ధమైన తీర్పునిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై ట్రంప్(Trump) సర్కారు తీవ్ర చర్యలు తీసుకుంటోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి. దీంతో దాదాపు 2,000 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఇక, ఇటీవల కొలంబియా యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. వీటికి మద్దతు తెలిపిన భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను డీహెచ్‌ఎస్ రద్దు చేసింది. దీనితో ఆమె స్వీయ బహిష్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు.
ఎవరీ బదర్ ఖాన్ సూరి..?
2020లో శాంతి, సంఘర్షణ అనే అంశంపై దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. విద్యార్థి వీసా పైన ఆయన అమెరికాకు వెళ్లారు. అక్కడ జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేస్తున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో శాంతి నెలకొల్పే అంశంపైనా పరిశోధనలు చేస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది. ఇక, ఆయన సతీమణి మాఫెజ్ సలేహ్. గాజాకు చెందిన ఆమెకు అమెరికా పౌరసత్వం ఉంది. ప్రస్తుతం ఆమె జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు.
Also Read : Lalu Prasad Yadav: ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ! ‘టైగర్ జిందా హై’ అంటూ హోర్డింగులు !