Bandi Sanjay : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
కేసీఆర్ ను డిమాండ్ చేసిన బండి సంజయ్
Bandi Sanjay : ప్రాణాలకు తెగించి చాలీ చాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న తెలంగాణలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా దారుణంగా మోసం చేశాడని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిందని, ఎందుకని అమలు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ కు పోయే కాలం వచ్చిందని అన్నారు. త్వరలోనే శంకరగిరి మాన్యాలు పట్టించక తప్పదన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్.
హైకోర్టు అంటే గౌరవం లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేదు అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అని ప్రశ్నించారు. 15 ఏళ్ల కిందట జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ పేరుతో 1105 మంది జర్నలిస్టులకు 70 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు బండి సంజయ్(Bandi Sanjay). ఆనాడు మార్కెట్ విలువ ప్రకారం జర్నలిస్టులంతా అప్పులు చేసి , తిప్పలు పడి రూ. 12 కోట్ల 50 లక్షలు ఇచ్చి స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి మాజీ సీజేఐ నూతలపాటి వెంకట రమణ స్పష్టమైన తీర్పు చెప్పారని, వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించారని అన్నారు. కానీ తీర్పు వచ్చి 10 నెలలైనా ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు కేసీఆర్ ను. శుక్రవారం పేట్ బషీరాబాద్ లోని జేఎన్జేహెచ్ సొసైటీ బండి సందర్శించారు. వేల కోట్ల విలువైన భూములపై కేసీఆర్ ఫ్యామిలీ కన్నేసిందన్నారు. ఈ భూమిని కూడా లాక్కోవాలని చూస్తోందంటూ ఆరోపించారు.
Also Read : Pawan Kalyan : సమస్యలపై జన సేనాని ఫోకస్