Bandi Sanjay : ప్రభుత్వ వైఫల్యం విద్యార్థులకు శాపం
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
Bandi Sanjay 10th Paper : నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం మరిచి పోక ముందే 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay 10th Paper). సోమవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో పాలనా వ్యవస్థ గాడి తప్పిందని, ఇందుకు ప్రశ్నా పత్రాల లీకులే ప్రత్యక్ష కారణమని ఆరోపించారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారిలో స్థైర్యాన్ని పోగొట్టేలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో అసలు సర్కార్ ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. 10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వెనుక ఎవరు ఉన్నారనేది తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు బండి సంజయ్. కేసీఆర్ ఇలాఖాలో పరీక్షల లీకేజీ సర్వ సాధారణంగా మారి పోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందన్న అనుమానం వ్యక్తం చేశారు.
కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించ లేని స్థితికి దిగజారడం దారుణమన్నారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చేతగాని తనం విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు సర్కార్ తొత్తుగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్(Bandi Sanjay).
Also Read : ఆర్టీసీ ఎండీకి భద్రాద్రి తలంబ్రాలు