టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ , కూతురు కవిత జైలుకు పోవడం ఖాయమన్నారు. తనకు పేపర్ లీకేజీతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు ఎంపీ.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు 10వ తరగతి పేపర్ లీకేజీలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లవుతున్నా ఈరోజు దాకా ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని, కాంట్రాక్టు కింద పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీనే లీకులు, లిక్కర్ వీరుల కుటుంబమని ఆరోపించారు. సీపీ రంగనాథ్ చెప్పినవన్నీ కట్టుకథలు, కల్పితాలేనని ధ్వజమెత్తారు బండి సంజయ్.
హిందీ పేపర్ ను తాను లీక్ చేశానని తనను అరెస్ట్ చేసిన పోలీసులు , మరి ముందు రోజు తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారో ఇప్పటి వరకు చెప్పలేదు ఎందుకని ప్రశ్నించారు. ఏప్రిల్ 8న జరిగే బీజేపీ సభకు ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.