Bangladesh : బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయానికి నిప్పు పెట్టిన దుండగులు

బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ నామ్‌హట్ట కేంద్రానికి దుండగులు నిప్పు పెట్టారు...

Bangladesh : బంగ్లాదేశ్‌లో ప్రార్థనా స్థలాలపై విధ్వంసకాండ ఆగడం లేదు. హిందువులు, మైనారిటీలపై దాడులు, ప్రార్థనా స్థలాల విధ్వంసంపై ఎల్లెడలా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అనంతరం దాడులు మరింత ముమ్మరమయ్యాయి. కాగా, తాజాగా శనివారం తెల్లవారుజామున కొందరు దుండగులు బంగ్లాదేశ్‌(Bangladesh) రాజధాని ఢాకాలోని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం కేంద్రానికి నిప్పుపెట్టారు. దీంతో ఆలయంలోని విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Bangladesh…

”బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ నామ్‌హట్ట కేంద్రానికి దుండగులు నిప్పు పెట్టారు. శ్రీ లక్ష్మీ నారాయణ్ విగ్రహంతో పాటు ఆలయంలోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి” అని రాధారమణ్ దాస్ తెలిపారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య దుండగలు శ్రీశ్రీ రాధాకృష్ణ ఆలయం, శ్రీశ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ్ ఆలయానికి నిప్పుపెట్టారని, ఇవి హరే కృష్ణ నామ్‌హట్టకు చెంది దౌర్ గ్రామంలో ఉన్నాయని, ఢాకా జిల్లా తురగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని దాస్ పేర్కొ్న్నారు. ఆలయం వెనుక నుంచి పైకప్పును తప్పించి పెట్రోల్‌ జల్లి నిప్పించినట్టు తెలుస్తోందన్నారు. హిందూ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని దాడులు అప్రతిహతంగా జరుగుతున్నాయని, దాడుల తీవ్రతను బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం దృష్టికి ఇస్కాన్ తీసుకువెళ్లినప్పటికీ పోలీసులు, అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నట్టు దాస్ ఆరోపించారు.

బంగ్లాదేశ్‌లోషేక్ హసీనా ప్రభుత్వం గత ఆగస్టులో కుప్పకూలి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. గత నాలుగు నెలులుగా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇస్కాన్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై గత వారంలో భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనను బంగ్లా సర్కార్ దృష్టికి తీసుకువెళ్లింది. బంగ్లాలోని మైనారిటీలు సహా ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదేనని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవల లోక్‌సభలో ప్రకటన చేశారు. హిందూ సాధువు, ఇస్కాన్ మాజీ సభ్యుడు అయిన చిన్మయ్ కృష్ణదాస్‌ను నవంబర్ 25న ఢాకాలో అరెస్టు చేయడం తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆయనకు బెయిలు నిరాకరిస్తూ కోర్టు జైలుకు పంపడంతో కోర్టు ఆవరణలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. చిట్టగాంగ్‌లో జరిగిన ఈ ఘర్షణల్లో అసిస్టెంట్ గవర్నర్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం అలిఫ్ మరణించాడు. కృష్ణదాస్ తరఫున న్యాయవాది ఎవరూ కోర్టుకు రాకపోవడంతో ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Also Read : Deputy CM Pawan : కడప సమస్యలు విని షాక్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Leave A Reply

Your Email Id will not be published!