Bhatti Vikramarka : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శాపం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్
Bhatti Vikramarka : తెలంగాణలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పేద ప్రజల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. బుధవారం పీపుల్స్ మార్చ్ యాత్ర సందర్భంగా ఆయన ప్రజలు, కూలీలు, నిరుద్యోగ యువకులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. పాలన గాడి తప్పిందని, అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు. ప్రత్యేకించి విద్యా రంగాన్ని నాశనం చేశారని, ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ ఆ నిధులను కూడా పక్కదారి పట్టించిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తామన్నారు. ఆస్పత్రి ఖర్చుల విషయంలో రూ. 5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
విద్య విషయంలో ప్రతి విద్యార్థికి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందన్నారు. అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు సీఎల్పీ నాయకుడు.
Also Read : KTR : లాయడ్స్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్ – కేటీఆర్