Bhatti Vikramarka : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన
నిప్పులు చెరిగిన సీఎల్పీ నేత భట్టి
Bhatti Vikramarka : తెలంగాణలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, సామాన్యులు బతికే పరిస్థితులు లేవన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి పవర్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కష్టాలు తప్ప ఒరిగింది ఏమీ లేదని మండిపడ్డారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా నకిరేకల్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నా వాటిని ఉపయోగించు కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన రంగాలైన విద్యా , వైద్య రంగాలను భ్రష్టు పట్టించారని, ఇవాళ స్కాంలు, కమీషన్లు తప్ప చెప్పుకునేందుకు బీఆర్ఎస్ సర్కార్ కు ఏమీ లేదన్నారు. పాలన గాడి తప్పిందని, ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). 1500 మంది అమరులైనా ఇప్పటికీ కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. ఫామ్ హౌస్ కు ఇన్నేళ్ల పాటు పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు అమర వీరుల జపం చేస్తుండడం దారుణమన్నారు.
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ పరువు తీస్తున్నారంటూ ఆవేదన చెందారు మల్లు భట్టి విక్రమార్క. ప్రజలంటే ఏ మాత్రం గౌరవం లేని వీళ్లను ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజలు మారాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు .
Also Read : AP Rains : ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు