#BhavaniDeeksha : ‌ భవానీ దీక్షల విర‌మ‌ణ‌కు విస్తృత ఏర్పాట్లు

Bhavani Deeksha: విజయవాడ లో ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము లో ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న‌ భవానీ దీక్షల విర‌మ‌ణ‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు ప్ర‌క‌టించారు.

విజయవాడ లో ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము లో ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న‌ భవానీ దీక్షల విర‌మ‌ణ‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు దీక్షల విరమణకు విచ్చేయు దీక్షాధారులకు,భక్తులకు మౌలిక వసతుల గురించి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరు క్యాంపు కార్యాల‌యంలో కృష్ణ జిల్లా క‌లెక్ట‌ర్ సమన్వయ సమావేశం నిర్వ‌హించారు. కరోనా వైరస్ రెండోద‌శ‌తో పాటు కొత్త‌గా రాష్ట్రంలో యుకె నుంచి వ‌చ్చిన వారి నుంచి స్ట్రెయిన్ వైర‌స్ సైతం వ్యాప్తి చేందే పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాధమిక నిర్ణ‌‌యాలు తీసుకున్న‌ట్టు ఆల‌య అధికారులు తెలిపారు.

భవానీ దీక్షలు – 2020ను పురస్కరించుకొని దీక్షా విరమణల లేదీల‌లో శ్రీఅమ్మవారి దర్శనము ఉదయం 4-00 గం.ల నుండి రాత్రి 8-00 గం.ల వరకు కల్పించ‌నున్న‌ట్టు వివ‌రించారు అలాగే ప్రతి భక్తుడు ఆన్ లైను నందు టోకెన్ తప్పనిసరిగా తీసుకొని , టొకెన్ తో పాటు ఏదైనా ఐ.డి. ప్రూఫ్ తప్పని సరిగా తీసుకొనిరావల్సిందేన‌ని లేకుంటే దర్శనమునకు అనుమతించకూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు website: www.kanakadurgamma.org , Mobile App: kanakadurgamma ల‌లో పొందు ప‌రిచిన‌ట్టు చెప్పారు.

కరోనా నియంత్రణ దృష్ట్యా దర్శనమునకు వచ్చు ప్రతి భక్తుడు తప్పకుండా మాస్కు ధరించి స్వియ దూరము పాటించాల్సిన బాధ్య‌త ఉంద‌ని, అలాగే COVID-19 నిబంధనలు అనుసరించి శ్రీ అమ్మవారి దర్శనమునకు వచ్చు 10 సంవత్సరములలోపు పిల్లలు, 65 సంవత్సరముల పైబడినవారు , దివ్యాంగులు, వృద్దులు, గర్బిణీ స్త్రీలు దర్శనమునకు అనుమతించ‌డం లేద‌ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని సూచించారు.

ఇక కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా దీక్షల విరమణల రోజులలో ఒక రోజుకు 10,000 మందికి మాత్రమే దర్శనమునకు అనుమతించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీక్షాధారులకు 9,000 ఉచిత టికెట్లు, భక్తులకు రూ.100/-లు టికెట్లు 1,000నెం.ల చొప్పున విక్రయించి దర్శనమునకు అనుమతించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేసారు. భక్తుల సౌకర్యార్ధం కొండ దిగువ భాగమున మహామండపము వద్ద ఇరుముడి పాయింట్లు మరియు హోమగుండములు ఏర్పాటు చేసామ‌ని, దీక్ష స్వీకరించిన భక్తులు ఇరుముడులను దేవస్థానమునకు సమర్పించాక మాలా విరమణను వారి వారి స్వగ్రామముల యందు గురు భవానీలచే మాల విరమణ చేసుకొవ‌ల‌ని సూచించారు.

అలాగే దుర్గ‌మ్మ అంతరాలయ దర్శనము పూర్తిగా నిలుపుదల చేసామ‌ని, కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా గిరి ప్రదక్షిణ కేశ ఖండన (తలనీలాలు సమర్పించుట) , నదీ స్నానములు, జల్లు స్నానములు నిలుపుదల చేసామ‌ని, దర్శనమునకు విచ్చేయు భక్తులు భౌతిక దూరం పాటించేలా COVID-19 నిబంధనలకు లోబడి క్యూ లైన్లు కెనాల్ రోడ్ , వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభిస్తామ‌ని అన్నారు.

ఇక కనకదుర్గనగర్ నందు ప్రసాద విక్రయ కేంద్రముల వద్ద భౌతిక దూరం పాటించు విధముగా ప్రసాదము కౌంటర్లు ఏర్పాటు చేసామ‌ని, ఇక ప్ర‌తి రోజూ ఉదయం 6-00 గం.ల నుండి సాయంత్రం 6-00 గం.ల వరకు ప్యాకెట్ల రూపములో దీక్షాధారులు , భక్తులకు వితరణ చేస్తామ‌ని చెప్పారు. అలాగే భ‌క్తుల కోసం సుమారు 10,00,000 సంఖ్యలో లడ్డూ ప్రసాదములను అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు.

భ‌క్తుల సౌక‌ర్యం కోసం కృష్ణా జిల్లా వైద్యారోగ్య శాఖ వారి ఆధ్వర్యములో 5 ప్రదేశములలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేసిన‌ట్టు ఆల‌య అధికారులు మీడియాకు పంపిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

No comment allowed please