Bhupathi Raju Srinivasa Varma: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మకు కారు ప్రమాదం ! స్వల్ప గాయాలు !
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మకు కారు ప్రమాదం ! స్వల్ప గాయాలు !
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాదంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గాయపడ్డారు. రెండు కార్లు ఢీకొని తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ బుధవారం సాయంత్రం విజయవాడ రావాల్సి ఉంది. ఈ మేరకు పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు ఆయన కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్… సడెన్ బ్రేక్ వేశాడు. దీనితో వెనుక వస్తున్న మరో కారు… శ్రీనివాసవర్మ వాహనాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తల, కాలుకు స్వల్పగాయాలు అయ్యాయి. డ్రైవర్‍కు మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు.
ఈ ప్రమాదంతో కాసేపు ఆందోళనకు గురైన కేంద్రమంత్రి అనంతరం తేరుకుని అదే కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం 05:30 గంటల సమయానికి విమానం ఎక్కి విజయవాడ బయలుదేరారు. విజయవాడలో గురువారం జరిగే ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పాల్గొననున్నారు. మరోవైపు శ్రీనివాసవర్మకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.