Botcha Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ !
Botcha Satyanarayana: విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా…. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botcha Satyanarayana) ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం ప్రకటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పలువురి పేర్లు పరిశీలించి… చర్చించిన తర్వాత బొత్స పేరును ప్రకటించారు. ఈ భేటీలో వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.
Botcha Satyanarayana Got Chance
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC) స్థానం కోసం… ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన.. ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక జరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా… అందులో వైఎస్సార్‌సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత జీవీఎంసీలో 12 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. వీరి బాటలోనే మరికొంతమంది కార్పోరేటర్లతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
కూటమి అభ్యర్ధిగా గండి బాబ్జీ ?
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఆయన ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లింది. దీనితో.. బాబ్జీకి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.