Boinpalli Abhishek Rao : అభిషేక్ రావు సరే తర్వాత ఎవరో
సీబీఐ దూకుడుతో బెంబేలు
Boinpalli Abhishek Rao : ఢిల్లీ మద్యం స్కాం దెబ్బకు ఒకరి వెంట మరొకరు క్యూ కడుతున్నారు. విచిత్రం ఏమిటంటే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ స్కాం వ్యవహారం మొత్తం ఇప్పుడు తెలంగాణ చుట్టూ తిరగడం విస్తు పోయేలా చేస్తోంది. ఎవరీ బోయినపల్లి అభిషేక్ రావు అనేది అంతు పట్టడం లేదు.
వీరికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో మద్యం పాలసీ సక్సెస్ కావడంతో ఇదే ఫార్మూలాను ప్రతి చోటా విస్తరించేలా ప్లాన్ చేయడం కూడా పలు విమర్శలకు దారితీసింది. గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కాంలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సీబీఐ. ఇదిలా ఉండగా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్
కుమార్ సక్సేనా ఎప్పుడైతే కొలువు తీరారో ఆనాటి నుంచీ ప్రతి రోజూ ఏదో ఒక దానిని సమీక్షించడం, విచారణ చేపట్టాలని ఆదేశించడం మామూలై పోయింది.
ఇప్పటికే ఆప్ సర్కార్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మద్యం స్కాం. ముగ్గురిని అదుపులోకి తీసుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ. కోట్ల రూపాయలు హవాలా రూపంలో మళ్లించారని గుర్తించింది.
రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావు(Boinpalli Abhishek Rao) ఫ్యామిలీతో కలిసి తిరుమలను దర్శించు కోవడం, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపు పడింది. అన్ని మూలాలు ఇక్కడే ఉండడం తెలంగాణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడి పోలీసులకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే సీబీఐ నేరుగా హైదరాబాద్ లో దిగడం, సోదాలు చేపట్టడం ఉన్నట్టుండి ఢిల్లీకి తీసుకెళ్లడం చర్చకు దారితీసింది.
నిధుల మళ్లింపులో అభిషేక్ రావు పాత్ర కీలకంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించినట్లు సమాచారం. నిధులను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు హవాలా మార్గంలో అభిషేక్ రావు అందిచనట్లు అనుమానిస్తోంది.
ఇదే సమయంలో ఇండో స్పిరిట్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి వచ్చిన నిధులు అభిషేక్ రావు ఖాతాలో జమ కావడం కలకలం రేపింది. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. సీబీఐ దూకుడు చూస్తుంటే మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం లేక పోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : నాపై బురద చల్లితే జనం నమ్మరు – మోదీ