తెలంగాణలో దూసుకు పోతోంది బహుజన్ సమాజ్ పార్టీ. ఎప్పుడైతే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ బాధ్యతలు స్వీకరించారో ఆనాటి నుంచి పార్టీలో నూతన చైతన్యం వెల్లి విరుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తోంది బీఎస్పీ. ప్రధాన పార్టీలకు ధీటుగా దూకుడు పెంచింది.
తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంపై దండోరా మోగించింది. చివరకు ప్రభుత్వం దిగి వచ్చింది. సిట్ ను ఏర్పాటు చేసింది. మరో వైపు నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. విద్యుత్ శాఖలో ఆర్టిజన్స్ గా పని చేస్తున్న 23 వేల మందికి అండగా ఉంటానని ప్రకటించారు. వారిని అరెస్ట్ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.
మంగళవారం హైదరాబాద్ లో కీలక ప్రకటన చేశారు ఆర్ఎస్పీ. మే 7న తెలంగాణ భరోసా పేరుతో బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గత 9 ఏళ్లుగా చితికి పోయిన నాలుగున్నర కోట్ల ప్రజలకు భరోసా కల్పించేందుకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ సీఎం కుమారి మాయావతి హాజరవుతారని వెల్లడించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సభకు సంబంధించి ఇవాళ కరపత్రం, వాల్ పోస్టర్లను విడుదల చేశారు.