Sridevi Death Case: శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై సీబీఐ ఛార్జిషీట్ !
శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై సీబీఐ ఛార్జిషీట్ !
Sridevi Death Case: అతిలోక సుందరిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు చూపిస్తూ అసత్య ఆరోపణలు చేసిన భువనేశ్వర్ కు చెందిన దీప్తి.ఆర్.పిన్నిటిపై సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేసారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు ఆదివారం ప్రకటించారు. 2018 ఫిబ్రవరిలో దుబాయ్ లో ఓ హోటల్ లో బాత్ టబ్ లో విగతజీవిగా పడిఉన్న శ్రీదేవి మరణం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ భువనేశ్వర్ కు చెందినన యూట్యూబర్ దీప్తి సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నారు. శ్రీదేవి మరణంకు గల కారణాలపై విస్తృతంగా చర్చించారు.
Sridevi Death Case Viral
ఆ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణంపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను శ్రీదేవి(Sridevi) మరణంపై సొంతంగా విచారణ జరిపానని… అందులో యూఏఈ, భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచాయంటూ పేర్కొన్నారు. తన వాదనలకు సమర్థనగా ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతో పాటు… సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లు అంటూ ఎవో కొన్ని పేపర్లను ఇంటర్వూలో చూపించారు. అయితే ఆమె చూపినవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబయికి చెందిన న్యాయవాది చాందినీ షా… సీబీఐని ఆశ్రయించారు. దీనితో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు… డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో సహా డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్వూల్లో దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై 120-బి (నేరపూరిత కుట్ర), 465, 469 మరియు 471తో సహా భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద ఆమె మరియు కామత్ పై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది
అయితే సీబీఐ చార్జ్ షీట్ పై దీప్తి స్పందిస్తూ… ‘‘నా వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ నాపై ఛార్జిషీట్ దాఖలు చేసిందంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది. ఇది చాలా దారుణంగా పరిగణిస్తున్నాను. నేను మోపిన అభియోగాలపై నా సాక్ష్యాలను కోర్టుకు అందజేస్తాను” అని ఆమె తెలిపారు. తమిళనాడులోని శివకాశికు చెందిన శ్రీదేవి(Sridevi)… 1967లో బాల నటిగా కన్దన్ కరుణై అనే తమిళ సినిమాతో తన నటనా జీవితాన్ని మొదలు పెట్టినది. తన అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి… దేశంలోనే అగ్రతారగా నిలిచింది. నిర్మాత బోనీకపూర్ ను వివాహం చేసుకుని జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిన శ్రీదేవి… పెళ్ళి తరువాత కూడా సినిమాల్లో నటించింది. అయితే దుబాయ్ పర్యటనలో ఉండగా 2018 ఫిబ్రవరి 24న తాను బసచేసిన హోటల్ లో బాత్ టబ్ లో విగతజీవిగా కనిపించింది.
Also Read : CPI Leader Narayana: అద్వానీకు భారతరత్న ప్రకటించడంపై సీపీఐ నారాయణ ఆగ్రహం !