Chandrababu Vision 2047 Comment : బాబు ‘విజ‌న్’ గ‌ట్టెక్కిస్తుందా

పొంత‌న లేని కామెంట్స్ తో ప‌రేషాన్

Chandrababu Vision 2047 Comment : విజ‌న్ అనే స‌రిక‌ల్లా ముందు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గుర్తుకు వ‌స్తారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ఏం చేసినా ముందు అభివృద్ది గురించి మాట్లాడతారు. ఆయ‌న క‌ల తెలుగు వారిని ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ గా చేయాల‌ని. ఆయ‌న క‌ల‌లు కంటారు. మిగ‌తా నేత‌లు లాగా కాదు. వాళ్లు హామీలు ఇస్తారు. కానీ చంద్ర‌బాబు(Chandrababu) మాత్రం టెక్నాల‌జీ పేరు ఎక్కువ‌గా వాడ‌తారు. అంత‌కంటే ఎక్కువగా జ‌పిస్తారు కూడా. హైద‌రాబాద్ త‌న వ‌ల్ల‌నే టాప్ లో నిలిచింద‌ని ఈ మ‌ధ్య చెప్పారు. ఇక సెల్ ఫోన్ల‌లో ఉప‌యోగించే టార్చ్ లైట్ ను తానే ప‌రిచ‌యం చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌ల‌సరి ఆదాయంలో ఇవాళ దేశంలో టాప్ లో తెలంగాణ ఉండేందుకు కూడా తానేన‌ని పేర్కొన్నారు. మొత్తంగా త‌ను లేక‌పోతే హైద‌రాబాద్ లేనే లేద‌ని చెబుతూ వ‌స్తున్నారు.

Chandrababu Vision 2047 Comment Viral

చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలోనే ప్ర‌పంచ బ్యాంకు ఆన‌వాళ్లు ఎక్కువ‌గా వ‌చ్చాయి. ఎక్క‌డ సంప‌ద ఉంటుందో, ఎక్క‌డ వ‌న‌రులు పుష్క‌లంగా ఉంటాయో , ఎక్క‌డ దోచుకునేందుకు వీలుగా ఉంటుందో, ఎక్క‌డైతే మాన‌వ శ్ర‌మ చవ‌క‌గా ల‌భిస్తుందో అక్క‌డ వ‌ర‌ల్డ్ బ్యాంక్ వాలి పోతుంది. వాళ్ల‌కు చంద్ర‌బాబు(Chandrababu) నాయుడు న‌చ్చాడు. చ‌క‌చ‌కా సంస్క‌ర‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఆయన కాలంలోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ఐటీకి కూడా ప్ర‌యారిటీ ల‌భించింది. విజ‌న్ అనే ప‌దం ఎక్కువ‌గా వ‌ర‌ల్డ్ బ్యాంకు వాడుతుంది. ఒకానొక స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు సీఎం కాద‌ని వ‌ర‌ల్డ్ బ్యాంకుకు ప్ర‌తినిధి అన్న అప‌వాదు కూడా మూట గ‌ట్టుకున్నారు.

తాను నిద్ర పోన‌ని ఇత‌రుల‌ను నిద్ర పోనివ్వ‌నంటూ ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తూ వ‌చ్చారు. అంతే కాదు స‌మాచారం, వివ‌రాలు, వీడియో కాన్ఫ‌రెన్స్ లు, ఉన్న‌తాధికారుల‌ను , క‌లెక్ట‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురి చేయ‌డంతో ఉద్యోగులు ఆయ‌న‌కు చెక్ పెట్టారు. త‌ను చింతించేలా చేశారు. మ‌రోసారి త‌న విజ‌న్ ను ముందుకు తీసుకు వ‌చ్చారు. దానికి అంద‌మైన పేరు పెట్టారు. విజ‌న్ 2047 అని. విజ‌న్ లేక పోతే భ‌విష్య‌త్తు అనేది ఉండ‌దంటారు చంద్ర‌బాబు(Chandrababu) నాయుడు. ఐదు వ్యూహాలు అమ‌లు చేస్తే చాలు రాష్ట్రం, దేశం ప్ర‌గ‌తి ప‌థంలో ప్ర‌యాణం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో తెలుగు వారు ప్ర‌ధాన పాత్ర పోషిస్తారంటూ ఆశా భావం వ్య‌క్తం చేశారు. ఆగ‌స్టు 15న గుర్తుగా ఈ విజ‌న్ ను విడుద‌ల చేశారు. ఆర్థిక వృద్దిలో ప్ర‌పంచంలో 3వ స్థానంలో ఉంటుంద‌ని , ఇత‌ర రంగాల‌లో రెండో స్థానానికి ఎదుగుతుంద‌ని అంచ‌నా వేశారు.

శ‌క్తిని గేమ్ ఛేంజ‌ర్ గా పేర్కొన్నారు. సోలార్ విండ్ , పంప్డ్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తి విధానంతో విద్యుత కొర‌త‌ను నివారించ వ‌చ్చ‌ని సూచించారు. హైడ్రోజ‌న్ , అమ్మోనియా హ‌బ్ ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా విద్యుత్ ఛార్జీలు త‌గ్గించ వ‌చ్చ‌ని తెలిపారు. రెండో వ్యూహం నీటి సంర‌క్షిత దేశాన్ని సాధించ‌డం. న‌దుల‌ను అనుసంధానం చేయ‌డం ద్వారా దీనిని అధిగ‌మించ వ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. మూడో వ్యూహం దేశ ప్ర‌గ‌తిలో డిజిట‌ల్ టెక్నాల‌జీ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని , ఇది దేశానికి మేలు చేకూరుస్తుంద‌ని పేర్కొన్నారు. నాలుగో వ్యూహం పీ4 . ప్ర‌జ‌లు, ప‌బ్లిక్ , ప్రైవేట్ భాగ‌స్వామ్యం ప్ర‌ధానంగా ఉంటుద‌న్నారు. ప్ర‌తి కుటుంబానికి సాధికార‌త క‌ల్పించాల‌ని సూచించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 1.8 కోట్ల మంది ప్ర‌వాస భారతీయులు ఉన్నార‌ని వారే దేశానికి సంప‌ద కాగ‌ల‌ర‌ని అంచ‌నా వేశారు. మొత్తంగా చంద్ర‌బాబు(Chandrababu) నాయుడు విజ‌న్ 2047 ఏ మేర‌కు గ‌ట్టెక్కిస్తుంద‌నేది వేచి చూడాలి.

Also Read : Sonia Gandhi Tribute : రాజీవ్..నీ జ్ఞాప‌కం ప‌దిలం – సోనియా

Leave A Reply

Your Email Id will not be published!