Chikun Gunya: తమిళనాడును వణికిస్తున్న చికున్ గున్యా !
తమిళనాడును వణికిస్తున్న చికున్ గున్యా !
Chikun Gunya: తమిళనాడు రాష్ట్రంలో చికున్ గున్యా జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ యేడాది జూన్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 330 మందికి పైగా చికున్ గున్యా(Chikun Gunya) బారినపడినట్లు అధికారికంగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా జ్వరం నిర్థారణ కోసం ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ఇంటి పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారిపోతున్నాయి. ఈ చిత్తడి నేలల్లో పెరిగే దోమలు చికున్ గున్యాతో డెంగీ, మలేరియా జ్వరాలకు ప్రధాన కారణమవుతున్నాయి.
Chikun Gunya…
ముఖ్యంగా ఎడిఎస్ అనే రకం దోమ కుట్టడం వల్ల చికున్‌గున్యా, డెంగీ జ్వరం సోకుతుంది. ఈ జ్వరం బారినపడినవారికి తీవ్రమైన జ్వరంతో పాటు తలనొప్పి, వళ్లు, మోకాళ్ళ నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, శరీరం నీరసించిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరికి శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా వస్తుంటాయి. ఈ జ్వరం మరింతగా ఎక్కువైన పక్షంలో శరీరం నుంచి రక్తం కూడా వస్తుంది. అందువల్ల చికున్ గున్యా లక్షణాలతో బాధపడేవారు తక్షణం వైద్యుడిని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చికున్ గున్యా బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ యేడాది జూన్ వరకు మొత్తం 1451 మందిలో చికున్ గున్యా లక్షణాలు కనిపించగా, వారిలో 331 మందికి ఈ జ్వరం సోకినట్టు నిర్థారణ అయింది. గత నాలుగేళ్ళ కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ జ్వరపీడితుల సంఖ్య ఈ యేడాది పెరుగుతోందని, అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికున్ గున్యా లక్షణాలు కనిపించినపక్షంలో తక్షణం వైద్యుడిని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. అదేసమయంలో మలేరియా, అంటు వ్యాధుల విభాగాల సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి జ్వరాలకు కారణమైన దోమల నిర్మూలనా చర్యలు చేపడుతున్నారు.
Also Read : Satya Kumar Yadav: అవయవదానానికి మంత్రి సత్యకుమార్ అంగీకారం !