అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏడాది నవంబరు నుంచి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులన్నీ వచ్చినందున త్వరితగతిన పనులు పునః ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరమైన అంశాల్లో బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రెండు గంటలకు పైగా సమయాన్ని జలవనరుల శాఖపై సమీక్షకు వెచ్చించారు. అటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో జలవనరుల సమర్థ నిర్వహణ, నదుల అనుసంధానమే లక్ష్యంగా జల వనరుల శాఖ పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని, 2028 డిసెంబరు నాటికి అన్ని ప్రాజెక్టులనూ అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న కాలువల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. జల హారతి కార్పొరేషన్ ద్వారా జల వనరుల శాఖకు ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక అంశాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం పనులు చేపట్టాలని, అత్యుత్తమ నిపుణులను నియమించి ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. చారిత్రక ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నందున నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం . ప్రాజెక్టులో ఇప్పటివరకు 90.2 శాతం సివిల్ పనులు పూర్తి అయినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో గ్యాప్-1, గ్యాప్-2 పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నిపుణుల కమిటీ పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.
