CM Chandrababu Naidu: ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది – ఏపీ సీఎం చంద్రబాబు

ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తోంది - ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా రూపాంతరం చెందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుందని… భవిష్యత్ అంతా భారత్ దేనని ఆయన స్పష్టం చేసారు. మద్రాస్‌ ఐఐటీలో నిర్వహించిన ‘ఆల్‌ ఇండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌ 2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతదేశం యొక్క శక్తి, సామర్థ్యాలను విద్యార్ధులకు వివరించారు. మరోవైపు సీఎం చంద్రబాబుకు(CM Chandrababu Naidu) మద్రాస్‌ ఐఐటీ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. దీనితో ఐ లవ్ ఇండియా… ప్రౌడ్ టుబి తెలుగు పీపుల్ అంటూ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పారు.

CM Chandrababu Naidu Comment

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘మద్రాస్‌ ఐఐటీ ఎన్నో విషయాల్లో నంబర్‌ వన్‌గా ఉంది. ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్‌ స్టార్టప్‌ అగ్నికుల్‌ మంచి విజయాలు అందుకుంది. ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతమవుతున్నాయి. ఈ ఐఐటీలో సుమారు 35-40 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారు. ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు. ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలు ఎంపిక కాదు… తప్పనిసరి. రాజకీయ సంస్కరణలతో సోవియట్‌ రష్యా అనేక దేశాలుగా విడిపోయింది. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. ఆ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ దేశం ఎదిగింది. భారత్‌ కూడా సంస్కరణల తర్వాత అభివృద్ధి బాట పట్టింది. బ్రిటిష్‌వారు మన దేశ సంపద అంతా తీసుకెళ్లారు… ఒక్క ఇంగ్లీష్‌ ను మనకు వదిలేశారు. 1990లలో కమ్యూనికేషన్‌ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, వీఎస్‌ఎన్‌ఎల్‌ గుత్తాధిపత్యం ఉండేది. ఆర్థిక సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థల రాక ఓ గేమ్‌ ఛేంజర్‌ గా మారింది.

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను మొదట కలుస్తానని అడిగినప్పుడు రాజకీయ నేతలతో సంబంధం లేదని చెప్పారు. ఆయన్ను ఒప్పించి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. 45 నిమిషాలు మాట్లాడారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ నెలకొల్పాలని కోరాను. ఇప్పుడు అదే సంస్థకు సీఈవోగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఉన్నారు. కొంతకాలంగా భారత్‌ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటోంది. 2014లో మనది పదో ఆర్థిక వ్యవస్థ… ఇప్పుడు ఐదో స్థానానికి చేరింది. భారత్‌ కు ఉన్న గొప్పవరం జనాభా… డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌. మనమంతా కృషి చేస్తే త్వరలోనే ప్రపంచంలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుంది. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయి. మన దేశానికి మరో 40 ఏళ్ల వరకూ ఆ సమస్య లేదు’’ అని చంద్రబాబు అన్నారు.

Also Read : MLC Duvvada Srinivas: విద్యుత్ శాఖ ఏఈకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను బెదిరింపులు

Leave A Reply

Your Email Id will not be published!