CM Chandrababu : ఎక్కడ ఇసుక దందాలు జరిగినా తిరుగుబాటు చేయండి నేను అండగా ఉంటా..
ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ వ్యవహారాలు పట్టించుకోవట్లేదని కేడర్ నుంచి వస్తున్న విమర్శలు అర్థం చేసుకోగలను...
CM Chandrababu : కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలోకి వైసీపీ నేతలు చొరబడ్డారని విమర్శించారు. ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయండి, తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. మద్యం ఎమ్మార్పీ ధరపై ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించవద్దని మందుబాబులను కోరారు. ఇవాళ(శనివారం) తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీతో కలిపి రూ.97 లు అయ్యే సినరేజ్ ఛార్జీకి రూ.35లకే టెండర్ వేస్తామంటూ వైసీపీ నేతలు వచ్చారని అన్నారు. ఇసుక కొరత సృష్టించి బ్లాక్‌మార్కెటింగ్ చేసి తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే అతి తక్కువ ధరకు టెండర్లు వేశారని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా, ఉచిత ఇసుక స్ఫూర్తి దెబ్బతినకూడదనే సినరేజ్ ఛార్జీలు, జీఎస్టీ కూడా ఎత్తి వేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
CM Chandrababu Comment
‘‘నేను 1995 సీఎంనే.. కానీ 2014 సీఎంను కాదు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తా. విశ్వాసనీయతను నిలబెట్టుకుంటూ రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ వ్యవహారాలు పట్టించుకోవట్లేదని కేడర్ నుంచి వస్తున్న విమర్శలు అర్థం చేసుకోగలను. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ రూ.10లక్షల కోట్లకు పైగా అప్పు భారం మోస్తున్నామనే విషయం గ్రహించాలి. మనం ఓ విషవలయంలో ఉన్నామని గుర్తించాలి. దీనిని పరిష్కరించేందుకు కొంత సమయం అవసరం. ఇప్పటికే చాలా వ్యవస్థలను గాడిలో పెట్టాం. మొన్నటి ఎన్నికల్లో రాక్షసుడితో యుద్ధం చేశాం. వైసీపీ నేతల వల్ల నష్టపోయిన కార్యకర్తలను ఆదుకుంటూనే, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలి. ఏపీలో ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయండి. నేను అండగా ఉంటా. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన తప్పుడు కేసులకు చట్ట పద్ధతిలోనే పరిష్కరిస్తా. ఎవ్వరూ తొందరపడొద్దు. ఎక్కువ అంచనాలు పెట్టేసుకుని ఎవ్వరూ నిరుత్సాహపడొద్దు. రాజకీయాల్లో ఎన్ని మార్పులు, సంస్కరణలు వచ్చినా, మూల సిద్ధాంతం ప్రజాసేవని మరవద్దు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read : AP Govt : ధరల నియంత్రణపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం