Hemant Soren Arrested: జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ! కొత్త సీఎంగా చంపయీ సోరెన్‌ !

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ! కొత్త సీఎంగా చంపయీ సోరెన్‌ !

Hemant Soren Arrested: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసారు. భారీ భద్రత నడుమ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని హేమంత్‌ సోరెన్‌ అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు సుమారు ఏడు గంటల పాటు సోరెన్ ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా ఆయన సమాధానాలివ్వలేదని తెలిసింది. ఆ తరువాత సోరెన్ ను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహువా మాఝీ తెలిపారు. బుధవారం రాత్రి హేమంత్‌ను ఆయన ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించి… ఆ తరువాత అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు.

ఈడీ విచారణ నేపథ్యంలో హేమంత్‌ తన తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. దీనితో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సోరెన్ మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. దీనితో హేమంత్ సోరెన్(Hemant Soren) నివాసం, ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఈడీ కోరినట్లు తెలుస్తోంది. దీనితో భారీ భద్రత నడుమ హేమంత్ సోరెన్ ను తన నివాసం నుండి ఈడీ కార్యాలయానికి తరలించారు.

ఇది ఇలా ఉండగా… ఈడీ తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren) బుధవారం రాజీనామా చేసారు. హేమంత్‌ రాజీనామాను గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదించడంతో… ఆయన స్థానంలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్‌ నేత, రవాణాశాఖ మంత్రి చంపయీ సోరెన్‌ ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీనితో జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్‌ గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.

అంతకుముందు రాంచీలో రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) అరెస్టు తరువాత అతని భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. అయితే కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కావడానికి సాక్ష్యాత్తూ సోరెన్ కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జేఎంఎం సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి, జార్ఖండ్ టైగర్ గా గుర్తింపు పొందిన చంపయీ సోరెన్‌ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కల్పనా సోరెన్‌ ముఖ్యమంత్రి కాకుండా తన తోటి కోడలు సీతా సోరెన్‌ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం.

Hemant Soren Arrested – జార్ఖండ్ సీఎంగా చంపయీ సోరెన్ !

జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయీ సోరెన్‌ ను ఎన్నుకున్నట్లు ఝార్ఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఆ తరువాత గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ కు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంపయీ సోరెన్‌ ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడు. 1956లో జిలింగోరా గ్రామంలో జన్మించిన చంపయీ సోరెన్‌… మెట్రిక్యులేషన్‌ చదివారు. ఆయనకు ఏడుగురు పిల్లలున్నారు.

సోరెన్ కుటుంబంలో బట్టబయలయిన ఇంటిపోరు !

ముఖ్యమంత్రి పదవిపై సోరెన్‌ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్‌ సోరెన్(Hemant Soren) సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్‌ బహిరంగ ప్రకటన చేశారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు ? పార్టీలో ఎంతో మంది సీనియర్‌ నేతలుండగా… ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు… కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్‌ను. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తా’ అని దుర్గా సోరెన్‌ భార్య, ప్రస్తుత ఎమ్మెల్యే సీతా సోరెన్‌ పేర్కొన్నారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో జార్ఖండ్ టైగర్ గా గుర్తింపు పొందిన సీనియర్ నేత, రవాణా శాఖా మంత్రి చంపయీ సోరెన్‌ ను ముఖ్యమంత్రిగా ఎన్నికున్నట్లు తెలుస్తోంది.

Also Read : Ravela Kishore Babu: వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు !

Leave A Reply

Your Email Id will not be published!