KCR : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకు వస్తున్నామని ప్రకటించారు. అంతే కాదు వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి తెలుగు మీడియం అంటూ ఉండదన్నమాట. వనపర్తి జిల్లా వేదికగా ఇవాళ సీఎం కేసీఆర్(KCR )మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమం వల్ల విద్యా రంగం మరింత పటిష్టవంతంగా మారుతుందన్నారు. ఇందుకు వనపర్తి జిల్లా నుంచే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
గతంలో రాష్ట్రం ఏర్పడక ముందు పాలమూరు జిల్లా అంటేనే కరవు జిల్లా అని పేరుండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి పనుల కోసం రావడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతగా ఆయన పేర్కొన్నారు.
తామందరం ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని పైకొచ్చిన వాళ్లమేనని చెప్పారు కేసీఆర్(KCR ). ఇవాళ నేను మాట్లాడుతున్నాననంటే అది తనకు గురువు చెప్పిన చదువు, నేర్పిన సంస్కారమేనని అన్నారు.
భవిష్యత్తులో మరింత సుందరంగా పాఠశాలలను తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన ప్రారంభం అవుతుందన్నారు.
విద్యార్థులంతా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగ్లంపై పట్టు సాధిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి బతక వచ్చన్నారు.
Also Read : ధిక్కార స్వరం ‘శోభ’క్క ప్రస్థానం