CM KCR : ఉమ్మడి పౌర స్మృతిని ఒప్పుకోం
స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
CM KCR : కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. కేంద్రం తీసుకు వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ ) ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ తో ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ముస్లిం నేతలు, మత పెద్దలు, మేధావులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వినతిపత్రం సమర్పించారు. యూసీసీని తీసుకు రావడం వల్ల దేశంలో మైనార్టీలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని పేర్కొన్నారు ఓవైసీ.
ఇది పూర్తిగా డాక్టర్ బాబా సాహెబ్ రాసిన భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆవేదన వ్యక్తం చేశారు. యూసీసీని తీసుకు వచ్చేందుకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకోవాలని సీఎం కేసీఆర్(CM KCR) కు విన్నవించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేసీఆర్. తమ పార్టీ, ప్రభుత్వం బేషరతుగా యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకమని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఓవైసీకి హామీ ఇచ్చారు. తమ సర్కార్ లౌకిక వాదాన్ని నమ్ముతుందని, కానీ కులం, మతం పేరుతో రాజకీయాలు చేయదన్నారు. దేశ అభివృద్దిని విస్మరించి కేవలం విద్వేష రాజకీయాలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీసీ వల్ల అన్ని మతాల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు సీఎం.
Also Read : G Kishan Reddy : బీఆర్ఎస్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్