KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. రైతులకు అన్యాయం జరిగితే తాను ఊరుకోనన్నారు. అన్నదాతలు పండించే ధాన్యం సేకరించేంత వరకు ఎంతటి పోరాటానికైనా సిద్దమని స్పష్టం చేశారు.
సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం తన అధ్యక్షతన జరిగింది. అనంతరం కేసీఆర్ (KCR)మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయంలో కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఈ విషయంపై తాడో పేడో తేల్చుకునేందుకు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢిల్లీకి వెళుతుందన్నారు. కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాన్ని ఇస్తుందని చెప్పారు సీఎం.
ఒకవేళ ధాన్యం సేకరించేందుకు ఓకే అంటే సంతోషమని, కానీ లేదంటే మాత్రం ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతామని హెచ్చరించారు కేసీఆర్(KCR). ఇక మాటలంటూ ఉండవని, ప్రకటనలకు పరిమితం కామన్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రజలు నిత్య పోరాటశీలురని , వారికి ఉద్యమాలు కొత్త కాదన్నారు. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన శక్తి ఈ ప్రాంత ప్రజానీకానికి ఉందన్న విషయం మోదీ మరిచి పోకూడదన్నారు.
టీఆర్ఎస్ పక్కా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ. దానికి ఎలా పోరాడాలో, ఎలా సాధించు కోవాలో ఎలా కేంద్రం మెడలు వంచాలో తెలుసన్నారు సీఎం.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ ఆందోళనలు, నిరసనలు కంటిన్యూగా ఉంటాయని స్పష్టం చేశారు కేసీఆర్. వంద శాతం ప్రొక్యూర్ మెంట్ ఆర్డర్ వచ్చేంత దాకా ఉద్యమిస్తామన్నారు.
Also Read : పార్టీకి విధేయులం వ్యతిరేకం కాదు