టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరితోనూ పేచీ లేదని స్పష్టం చేశారు. బీహార్ లో ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ మేరకు సీఎం నితీశ్ కుమార్ ను కోరారు. సోమవారం సీఎం మమతా బెనర్జీ బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో సమావేశం అయ్యారు. అనంతరం తనకు ఎలాంటి అహం లేదన్నారు. ప్రధానంగా దేశంలో ఆక్టోపస్ లా విస్తరించిన కాషాయ పార్టీకి చెక్ పెట్టాలంటే ఒంటరిగా పోరాడలేమని, కలిసికట్టుగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇందుకు సంబంధించి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన ఎవరికీ ఉండ కూడదన్నారు మమతా బెనర్జీ. బీజేపీ వ్యతిరేక పార్టీల మహా కూటమిపై తనకు ఎలాంటి వ్యతిరేకత అన్నది లేనే లేదని కుండ బద్దలు కొట్టారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వర్సెస్ ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. దీనిని గుర్తించి సమన్వయం చేసుకోగలిగితే నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు వీలు కలుగుతుందని అన్నారు సీఎం మమతా బెనర్జీ.
నేను నితీశ్ కుమార్ కు ఓ అభ్యర్థన చేశాను. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం బీహార్ నుండి ప్రారంభమైంది. మనమంతా బీహార్ లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం తీసుకోవచ్చు. ముందుగా మనమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బెంగాల్ సీఎం దీదీ.
