CM MK Stalin : మంత్రివర్గంలో త్వరలో కీలక మార్పులు
ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.....
CM MK Stalin : త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin) ప్రకటించారు. మంగళవారం ఉదయం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూరు శాసనసభ నియోజకవర్గంలో కార్పొరేషన్, సీఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ… మంత్రివర్గంలో తప్పకుండా మార్పులు జరుగుతాయని, అవి ఎవరూ నిరాశచెందేలా ఉండవని స్పష్టం చేశారు. మంత్రి ఉదయనిధికి డిప్యూటీ సీఎం కావటం ఖాయమంటూ మంత్రి వర్గ సహచరులు, పార్టీ నేతలు పదేపదే చెబుతున్న విషయాన్ని విలేఖరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా అందరూ ఆశించే విధంగానే మంత్రివర్గ మార్పులు జరుగుతాయంటూ, నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
CM MK Stalin Comment
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం జిల్లా కలెక్టర్లతో తరచూ వర్షం, వరద ముందస్తు జాగ్రతల విషయమై చర్చలు జరుపుతున్నారని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. తనను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న కొళత్తూరు ప్రజలు ఎల్లప్పుడూ తనపట్ల ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్నారని, అందుకే తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా విదేశీ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత ఈపీఎస్ డిమాండ్ చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ విషయమై పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా సమగ్రమైన వివరాలతో ప్రకటన చేశారని తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో విదేశీ పెట్టుబడుల సమీకరణ ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలిసేందేనని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : Muhammad Yunus : అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ అయిన ముహమ్మద్ యూనస్