MK Stalin : రూ.1,300 కోట్ల ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం
గత పాలకులపై నిప్పులు చెరిగిన స్టాలిన్
MK Stalin : డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. గతంలో తమిళనాడును ఏలిన అన్నాడీఎంకే పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. వారి నిర్వాకం వల్లనే ఇవాళ రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిందన్నారు. ఆదివారం తమిళనాడు లోని సేలంలో రూ. 1,300 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు ఎంకే స్టాలిన్(MK Stalin). ఈ సందర్బంగా చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నా పార్క్ లో దివంగత మాజీ సీఎం కరుణానిధి 16 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంకే స్టాలిన్ ప్రసంగించారు. కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ నిర్వాకం కారణంగా తమిళనాడు రాష్ట్రానికి ఆదాయం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లిందని ధ్వజమెత్తారు సీఎం. తాము పవర్ లోకి వచ్చాక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. కరోనా కష్ట కాలంలో గట్టెక్కామని, వరదలతో , తుఫాను మనల్ని ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు.
అయినా ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పారు ఎంకే స్టాలిన్. ఇదే సమయంలో కేంద్రం తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిందని, చివరకు ప్రభుత్వం ఇచ్చిన నోట్ ను చదవకుండా అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన ఘనత ఎక్కడా లేదన్నారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కేంద్రం కావాలని గిల్లి కజ్జాలకు దిగుతోందని, కానీ డీఎంకేతో, తమిళనాడుతో పెట్టుకుంటే చివరకు ఓటమి తప్పదని హెచ్చరించారు.
Also Read : Mass Wedding Record : 2,431 జంటల పెళ్లిళ్లతో వరల్డ్ రికార్డ్