CM MK Stalin : ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి పదవిపై అప్డేట్
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు...
CM MK Stalin : తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్(CM MK Stalin) ఎట్టకేలకు స్పందించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సిఫార్సులు వస్తున్న మాట వాస్తవమేనని, కానీ అవేవీ ఫలించలేదని సరదాగా వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఆయన మరోమారు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అలాగే, అనేక మంది లబ్ధిదారులకు ప్రజా సంక్షేమ సహాయాలను ఆయన పంపిణీ చేశారు.
CM MK Stalin Comment
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి(Deputy CM) పదవి ఇవ్వాలని అనేకమంది కోరారని, కానీ, అవేవీ ఫలించలేదని, పైగా ఇప్పట్లో అది సాధ్యం కాదని స్పష్టం చేశారు. అదేసమయంలో మంత్రివర్గ మార్పులు చేర్పులపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానాలు దాటవేశారు. అయితే, ఆదివారం కురిసిన వర్షంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆదివారం ఒక్క రోజే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఎంత వర్షం కురిసినా, వర్షపాతం నమోదైనా ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నియోజకవర్గ పరిధిలోని పెరియార్ నగర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ఆస్పత్రిని రూ.109.89 కోట్లతో ఆరంతస్తుల్లో నిర్మిస్తున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా నియోజకవర్గంలో రూ.8.45 కోట్లతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు కొత్తగా రూ.3.25 కోట్ల తో మరికొన్ని కొత్త అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తనికాచలంలో రూ.91.36 కోట్లతో నిర్మిస్తున్న ఉపరితల నీటి ప్రవాహ కాలువ పనులను ఆయన పరిశీలించారు. కొళత్తూరు ఎమ్మెల్యే అభివృద్ధి నియోజకవర్గ నిధులతో శ్రీనివాసన్ నగర్ మూడో ప్రధాన శాలైలో నిర్మించే ప్రాథమిక పాఠశాల భవానికి ఆయన శంకుస్థాపన చేశారు. నేర్మై నగర్‌లో సీఎండీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మార్కెట్ పనులను ఆయన తనిఖీ చేశారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఎం.సుబ్రహ్మణ్యం, పీకే శేఖర్‌బాబు, నగర మేయర్ ఆర్.ప్రియ, కార్పొరేషన్ కమిషనర్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక డీఎంకే నేతలున్నారు.
Also Read : SK Hasina : బంగ్లాదేశ్ ప్రధాని హసీనా కి భారత్ ప్రత్యేక సెక్యూరిటీ