CM Ramesh: బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్ట్ ! మాడుగులలో హై టెన్షన్ !
బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్ట్ ! మాడుగులలో హై టెన్షన్ !
CM Ramesh:అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి వైసీపీ అభ్యర్ధి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో కూటమి అభ్యర్థికి మద్దతిస్తోన్న ఓ కార్యకర్త ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో ప్రచారం చేసుకుంటున్న సమయంలో… స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి కూటమి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. డ్రోన్ కెమెరాతో పాటు సామగ్రిని ధ్వంసం చేశారు. దీనితో బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా… దెబ్బలుతిన్న కార్యకర్తలనే స్టేషన్ కు తీసుకెళ్లారని కూటమి నేతలు తెలిపారు.
CM Ramesh:
సమాచారం తెలుసుకున్న బీజేపీ అభ్యర్ధి సీఎం రమేష్(CM Ramesh) హుటాహుటీన తారువ గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ గ్రామంలో డిప్యూటీ సీఎం, వైసీపీ అభ్యర్ధి బూడి ముత్యాల నాయుడు ఉండటంతో పోలీసులు కూటమి అభ్యర్ధి సీఎం రమేష్(CM Ramesh) ను గ్రామంలోనికి అనుమతించలేదు. దీనితో తన మనిషిని ఎందుకు కొట్టారు ? ఆయన చేసిన తప్పేంటి? అని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రశ్నిస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. దీనితో పోలీసులు కూటమి అభ్యర్ధి సీఎం రమేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనితో అనకాపల్లిలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది.
సీఎం రమేష్ అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంపై బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? కూటమి అభ్యర్ధి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని అధికారులపై ఆమె కన్నెర్రజేశారు. రమేష్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని… ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులతో ఈ పనులు చేయిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు.
శనివారం నాడు బీజేపీ శ్రేణులు… అనకాపల్లి పరిధిలోని పలు గ్రామాల్లో అగ్రికల్చర్ డ్రోన్స్ ఉపయోగించి బీజేపీ జెండాను ఎగురవేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామం తారువ గ్రామంలో కూడా బీజేపీ శ్రేణులు డ్రోన్ ఎగురవేశారు. అయితే బీజేపీ శ్రేణులపై ముత్యాలనాయుడు, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న బీజేపీ నేత, ముత్యాల నాయుడి మొదటి భార్య తమ్ముడు… నేరుగా ముత్యాలనాయుడి వద్దకు వచ్చి ప్రశ్నించారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ రెచ్చిపోయిన ముత్యాలనాయుడు… తన బావమరిది అని కూడా చూడకుండా అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడికి తెగపడ్డారు. ఆయన వెంటపడి ఇంట్లోకి చొరబడి, తలుపులు బద్దలుకొట్టి కిరాతకంగా దాడి చేశారు. దీనితో బాధిత నేత పోలీస్ స్టేషన్ లో ముత్యాలనాయుడిపై ఫిర్యాదు చేశారు.
సమాచారం తెలుసుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్(CM Ramesh) దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ముత్యాల నాయుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపు స్టేషన్ ఎదుట బైఠాయించారు. బాధిత కార్యకర్త ఇంటికి వెళ్లేందుకు సీఎం రమేశ్ బయల్దేరగా… పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా సరే.. ఆయన పట్టుబట్టి తారువ గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు కూడా తారువ గ్రామంలో ఉండటంతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితి నెలకొంది.
దీనితో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. బాధిత కార్యకర్తలను పరామర్శించే వరకు గ్రామం నుంచి వెళ్లేది లేదని సీఎం రమేశ్ అక్కడే వేచి ఉన్నారు. దీనితో ఆయన్ను అదుపులోకి తీసుకుని దేవరాపల్లి స్టేషన్‌కు తరలిస్తుండగా ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు పోలీసు వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో సీఎం రమేశ్ చొక్కచిరిగిపోగా… ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. రమేష్ వాహనంతో పాటు కాన్వాయ్ లోని మరో మూడు కార్లపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడటంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.
Also Read :-Kanakamedala Ravindra Kumar: ఏపీ డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి – మాజీ ఎంపీ కనకమేడల