CM Revanth Reddy: యువత నైపుణ్య శిక్షణకు పెద్దపీట
యువత నైపుణ్య శిక్షణకు పెద్దపీట
CM Revanth Reddy: రాష్ట్రంలో యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
CM Revanth Reddy Comment
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు తో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య విశ్వవిద్యాలయంపై తన ఆలోచనలు పంచుకున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ సంస్థలు ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం వహించాలని సీఎం పిలుపునిచ్చారు. యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్య వర్సిటీకి 150 ఎకరాల స్థలం, రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిర్వహణకు అవసరమయ్యే కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలని కోరారు. విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణానికి చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ భవనాలకు సంస్థల లేదా దాతల పేర్లు పెట్టాలని అధికారులకు సూచించారు.
డిగ్రీ, పీజీ పట్టాలు ఉంటే సరిపోదు.. ఏటేటా లక్షల మంది యువత డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నారు. అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన లక్షల మంది యువత ఏదోఒక ఉద్యోగం ఇప్పించాలంటూ మా వద్దకు వస్తున్నారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడే మానవ వనరుల కొరత ఉంది. వివిధ రంగాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉండదు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. దసరా తర్వాత అక్టోబరులో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించింది. ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’ భవనంలో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది. ముందుగా హెల్త్‌కేర్, ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించనుంది. వీటి నిర్వహణకు అపోలో, ఏఐజీ, లెన్స్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అల్కార్గో, ప్రొ కనెక్ట్, ఓ9 సొల్యూషన్స్ సంస్థలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.