CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణా నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో గ్రూప్-1 నియామకాలు చేపడుతున్నట్లు తీపి కబురు చెప్పారు. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీవో పోస్టులకు ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
‘‘ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలోనే ఏపీలో భారీ ప్రాజెక్టులకు నెహ్రూ శంకుస్థాపన చేశారు. నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్, శ్రీశైలంతోనే మనకు నీళ్లు అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 50, 60 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి మనకు నీళ్లు ఇస్తున్నాయి. నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్ ఎన్నో వరదలు, ఉపద్రవాలను తట్టుకుని నిలబడ్డాయి. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లలోనే కూలింది. కట్టిన మూడేళ్లలోనే కూలిన ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదు.
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో అదనంగా వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందలేదు. కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టు నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామన్నారు. గ్రూప్-1 నియామకాలు అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. త్వరలోనే గ్రూప్స్ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.